10లక్షల మందిని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో ఉన్నాం: జాతీయ సరస్ మేళాలో సీఎం చంద్రబాబు
దేశం మొత్తం దృష్టి సారించేలా విజయవాడ వేదికగా జాతీయ సరస్ మేళా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మహిళా సంక్షేమానికి, మహిళల ఆర్ధిక బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు వివరించారు.
10 లక్షల మంది మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దసరా శరన్నవరాత్రుల వేళ విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కొత్త గుర్తింపు తెచ్చే 'స్వయం ఏపీ' బ్రాండ్పై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళా శక్తిని చాటేందుకే ఢిల్లీ వెలుపల తొలిసారి విజయవాడలో ఈ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు గుర్తింపు తేవడమే ఈ మేళా లక్ష్యమని సీఎం అన్నారు. "మహిళలు ఎదిగితే కుటుంబం, సమాజం, దేశం ఎదుగుతాయి.
6 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం" అని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన డ్వాక్రా ఉద్యమం నేడు 11 లక్షల స్వయం సహాయక సంఘాలతో రూ.69 వేల కోట్ల టర్నోవర్ సాధించి ఏపీని అగ్రస్థానంలో నిలిపిందని గర్వంగా చెప్పారు. ఏడాది కాలంలో లక్ష మంది, తర్వాత 5 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని, చివరికి 10 లక్షల మందిని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.
ఇందుకోసం డ్వాక్రా ఉత్పత్తులకు 'స్వయం ఏపీ' బ్రాండ్ తీసుకొచ్చామని, ఈ-కామర్స్, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళలకు భరోసా ఇస్తూనే, 'వెల్ఫేర్ టు వెల్త్' నినాదంతో వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఎస్హెచ్జీని ఆర్థిక శక్తిగా, ప్రతి గ్రామాన్ని ఉపాధి కేంద్రంగా మార్చి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాధిస్తామని సీఎం తెలిపారు.














Click it and Unblock the Notifications
