మహిళలూ ఫ్రీగా బస్సుల్లో తిరగడానికి రెడీ అవ్వండి..చంద్రబాబు ఇచ్చే తొలి కానుక మీకే..
Chandrababu Naidu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్‌ను నింపాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లను సాధించింది ఈ రెండు చోట్ల కూడా.
ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్‌ను కలుస్తారని చెబుతున్నారు.

2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ. కనీసం 20 సీట్లను కూడా దక్కించుకోలేనంత దీనస్థితికి చేరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లయినా లభించాయి. అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది.
టీడీపీ- జనసేన- బీజేపీకి కలిపి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే ఖరారయ్యాయి. కౌంటింగ్ పూర్తిగా ముగిసేసమయానికి ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ నంబర్లు పాతాళానికి పడిపోతూ వచ్చాయే తప్ప ఏ స్థాయిలోనూ మెరుగుపడలేదు. కనీసం గట్టిపోటీ సైతం ఇవ్వలేకపోయింది టీడీపీ కూటమికి.
ఈ థంపింగ్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమౌతున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. అదే సమయంలో మంత్రివర్గాన్ని కూడా విస్తరించే అవకాశం ఉంది. అంతకంటే ముందు- టీడీఎల్పీ సమావేశమౌతుంది. తమ పార్టీ నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకోనుంది.
ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు.. తొలి సంతకం దేని మీద పెడతారనేది చర్చనీయాంశమౌతోంది. ప్రమాణ స్వీకారం అనంతరం.. ఆయన పెట్టే తొలి సంతకం- ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంపైనే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన సంతకం చేస్తారని చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటి- రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్టీఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం. ప్రస్తుతం ఈ విధానం కర్ణాటక, తెలంగాణల్లో అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఈ హామీదే కీ రోల్. దాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications