ఆ రెండు ఘటనలు: హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చోటుచేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది.
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, దాడులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్‌సభ సభ్యులు దీనికి హాజరయ్యారు.

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్‌హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు.
ఈ ఆందోళనలో సంఘీభావం తెలిపిన పార్టీలు, నాయకులకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆందోళనను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరుగుతున్న హేయమైన దాడులు, హత్యలు, అత్యాచారాల పట్ల జాతీయ స్థాయిలో తాము ఉద్యమిస్తామని జగన్ తెలిపారు.
ఈ ఆందోళన విజయవంతమైన నేపథ్యంలో- చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల అయింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో ఏర్పాటయ్యే నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. జగన్ ఆందోళనకు జాతీయ స్థాయిలో అంచనాలకు మించిన మద్దతు లభించడం, లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలనుె ప్రవేశపెట్టిన తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజధాని అమరావతి నిర్మాణానికి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో 15,000 కోట్ల రూపాయలను అప్పుగా ఇస్తామంటూ నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి గాను చంద్రబాబు ఆమెను కలిసి ధన్యవాదాలు తెలుపుతారని తెలుస్తోంది. పొలవరం ప్రాజెక్టు పురోగతిపై జల్ శక్తి మంత్రికి వివరిస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications