శ్రీరామ నవమి నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ఆసక్తికర సందేశాలు
నేడు శ్రీరామనవమి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వాడవాడలా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ. ఇక శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయ నాయకుల శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆసక్తికరంగా ఉంటున్నాయి.
సీఎం జగన్ శ్రీరామ నవమి విషెస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో ఈ సంవత్సరం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆసక్తికర పోస్టులు పెట్టారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

రామ కథ చెప్పిందిదే: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు తాను పెట్టిన పోస్టులో త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం... ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన అంటూ పేర్కొన్నారు. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోందన్నారు చంద్రబాబు.అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుంది. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీలో రామరాజ్యం నాటి పాలన: చంద్రబాబు ఆకాంక్ష
మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం నాటి పాలన అందిరావాలని కోరుకుంటూ... మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్టు ద్వారా చంద్రబాబు ఏపీలో వచ్చే ప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలోని రామరాజ్యం నాటి పాలన అందించే తమ ప్రభుత్వమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రజలకు రాక్షస పాలన నుండి విముక్తి కలగాలి: పవన్ కళ్యాణ్
మరోవైపు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కూడా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ధర్మ పరిపాలనకు నిదర్శనమైన ఆ అయోధ్య రాముని ఆశీస్సులతో, త్వరలో సుస్థిరమైన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా, ప్రజలకు రాక్షస పాలన నుండి విముక్తి కలిగించేలా చూడాలని ప్రార్థిస్తున్నాను అంటూ జనసేన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications