కొడాలి నానిపై చంద్రబాబు భారీ స్కెచ్ : గుడివాడ అభ్యర్ధి ఫిక్స్ - హోరాహోరీ : పవన్ సహకరిస్తే..!!
ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాలు మొదలయ్యాయి. అధికారం నిలబెట్టుకోవటం ద్వారా..టీడీపీని మరోసారి దెబ్బ కొడితే రానున్న రోజుల్లో తమకు పోటీ ఉండదని వైసీపీ భావిస్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని..జగన్ కు చెక్ పెట్టాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇదే సమయంలో అధికారం దక్కించుకోవంటంతో పాటుగా తమపైన రాజకీయంగా విరుచుకుపడుతున్న మంత్రులు కొడాలి నాని... తనను తన సొంత నియోజకవర్గంలో దెబ్బ తీస్తూ వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఈ సారి చంద్రబాబు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా.. ఈ సారి గుడివాడ నుంచి ముందుగానే అభ్యర్ధిని ఖరారు చేసి రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఆ ఇద్దరు మంత్రులు లక్ష్యంగా
అదే విధంగా పుంగనూరులో ఎలాగైనా పెద్దిరెడ్డిని ఓడిస్తానని శపధం చేసిన చంద్రబాబు అక్కడ సైతం బలమైన అభ్యర్ధి కోసం అన్వేషిస్తున్నారు. ఇక, గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు 2019 ఎన్నికల్లో దేవినేని అవినాశ్ ను చంద్రబాబు బరిలోకి దింపినా..కొడాలి నాని గెలుపును అడ్డుకోలేకపోయారు.
ఇక, ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన కొడాలి నాని ఇప్పుడు చంద్రబాబు - లోకేష్ టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు. తాజాగా, సంక్రాంతి సమయంలో గుడివాడలో కేసినో వ్యవహారం పైన మంత్రి నానిని సాధ్యమైన మేర డామేజ్ చేసేందు కు టీడీపీ ప్రయత్నించింది. కానీ, స్థానికంగా ఉన్న టీడీపీ నేతల మద్దతు మాత్రం లభించలేదని తెలుస్తోంది. ఈ సారి కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనే ఆలోచనలో భాగంగా..ఇప్పటిక గుడివాడ నియోజకవర్గం లో సర్వేలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గుడవాడ పై సర్వేలు - స్పెషల్ ఫోకస్
అయితే, ఇదే సమయంలో అక్కడి సామాజిక సమీకరణాల్లో భాగంగా రెండు ప్రణాళికలతో సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. 2019 ఎన్నికల్లో కొడాలి నానికి 89,833 ఓట్లు .. దేవినేని అవినాష్ కు 70,355 ఓట్లు పోలయ్యాయి. అయితే, టీడీపీ ఎంపీ అభ్యర్ధికి ఇదే ఎన్నికల్లో గుడివాడలో 75,790 ఓట్లుగా రాగా.. వైసీపీ అభ్యర్దికి 75 వేల ఓట్లు దక్కాయి. అయితే, జనసేన అభ్యర్దికి సైతం 10 వేల ఓట్లకు పైగా వచ్చాయి. గుడివాడ లో దాదాపు 30 వేలు కాపు సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి.
అందులో మెజార్టీ శాతం కొడాలి నానికి మద్దతుగా నిలుస్తున్నారు. కమ్మ వర్గం ఓట్లు 14 వేల వరకు ఉండగా.. అవి కాని వర్సస్ టీడీపీ మధ్య చీలిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు తో పాటుగా పవన్ కళ్యాణ్ కు సైతం గుడివాడ లక్ష్యంగా మారుతోంది. ఇక్కడి సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవటంతో పాటుగా.. జనసేనతో పొత్తు ఉంటే..అక్కడ ఈ సారి పవన్ - చంద్రబాబు కలిసి అభ్యర్దిని ఖరారు చేయనున్నారు.

పవన్ సహకరిస్తే ఓకే..లేకుంటే ఇలా
టీడీపీ తో జనసేన పొత్తు సాధ్యం కాకుంటే మాత్రం ఎవరిని బరిలోకి దించాలనే అంశం పైన ఇప్పటికే టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీలో చర్చ వినిపిస్తోంది. ఇక్కడ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే చంద్రబాబు అంటే విరుచుకుపడే కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబం పైన మాత్రం అభిమానం చూపిస్తున్నారు.
నందమూరి హరిక్రిష్ణతోనూ ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. ఇదే సమయంలో విజయవాడ జిల్లాకు జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తూ..టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేసారు. దీంతో..ఇక, ప్రస్తుతం హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా..నందమూరి వారసుడు నందమూరి బాలయ్యను వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీకి దింపే ఆలోచన జరుగుతున్నట్లుగా పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది.

బాలయ్య పైనే చంద్రబాబు ఆశలు
ఇందు కోసం నందమూరి కుటుంబ సభ్యుల ద్వారా బాలయ్యను ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. బాలయ్య అయితే గెలుపు సాధ్యమని టీడీపీ అంచనా వేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు కొడాలి నాని ఎప్పుడు బాలయ్య పైనా..అదే విధంగా బాలయ్య ఏ సందర్బంలోనూ కొడాలి నాని పైన విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ, గుడివాడలో చంద్రబాబు వచ్చినా.. అక్కడ కొడాలి నాని ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలంటూ స్వయంగా నాని వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, బాలయ్య కు అక్కడ టీడీపీకి సాంప్రదాయంగా ఉన్న ఓట్లతో పాటుగా... నందమూరి కుటుంబం లో మెజార్టీ సభ్యులు ఇప్పుడు గుడివాడ తో పాటుగా గన్నవరంలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

హోరా హోరీ పోరులో గెలుపెవరిది..
ఇదే సమయంలో కొడాలి నాని బలమైన నేతగా నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం హిందూపూర్ లో వరుసగా రెండో సారి గెలిచిన బాలయ్య..వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారేందుకు అంగీకరిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అదే సమయంలో జనసేన ఎటువంటి పాత్ర పోషిస్తుందీ అనేది కీలక అంశం.
దీంతో.. బాలయ్య గుడివాడ నుంచి కొడాలి నాని పైన పోటీకి దిగితే...ఖచ్చితంగా పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో..బాలయ్య - కొడాలి నాని మధ్య పోటీ ఏ రకంగా సాగుతోంది.. ఎటువంటి ఫలితం వస్తుందనేది ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications