హైకోర్టు, ఏసీబీ కోర్టుకూ మధ్య చంద్రబాబు ? అక్కడ మిస్సయితే ఇక్కడ చిక్కులు ఇలా..
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి బెయిల్ పై విడుదలవుతారా లేదా ? ఇప్పుడు రాష్ట్రంలో దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ చంద్రబాబును జైలుకు పరిమితం చేసి టీడీపీ శ్రేణుల మానసిక స్ధైర్యం దెబ్బతీయడంతో పాటు ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంచాలన్న వైసీపీ సర్కార్ ప్లాన్స్ ఇందుకు కారణం. దీంతో ఇప్పుడు చంద్రబాబు భవిష్యత్తు హైకోర్టు, ఏసీబీ కోర్టు మధ్య ఊగిసలాడుతోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తనపై పెట్టిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ లను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు నేడో, రేపో వెలువడనుంది. ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే స్కిల్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ.. ఎందుకైనా మంచిదని మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్ కోరుతూ పిటిషన్లు వేసింది.

దీంతో చంద్రబాబు కూడా అప్రమత్తమయ్యారు. హైకోర్టులో ఓవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు, సీఐడీ దూకుడు ప్రదర్శిస్తున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులోనూ ముందస్తు బెయిల్ కోరుతూ అక్కడే పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో దాదాపు రేపు, ఎల్లుండిలో తీర్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ హైకోర్టులో చంద్రబాబుకు ఈ రెండు కేసుల్లోనూ ఊరట లభిస్తే ఏం చేయాలన్న దానిపై సీఐడీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఏసీబీ కోర్టులో ఓవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దాఖలు చేసినట్లుగానే ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులోనూ పీటీ వారెంట్ కోరింది. ఈ పిటిషన్లు ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి.
ఇప్పటికే హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరిన చంద్రబాబు, ఇప్పుడు సీఐడీ ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్ కోరిన నేపథ్యంలో ఈ కేసులోనూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. అప్పుడు హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తున్నంది ఆసక్తికరంగా మారింది. ఇలా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభిస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో అరెస్టు చేయడానికి, అక్కడా కుదరకపోతే ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేసి జైల్లో ఉంచేందుకు సీఐడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో ఈ కేసులన్నీ తేలడానికి కొంత సమయం పట్టే అవకాశముంది.












Click it and Unblock the Notifications