Nara devaansh: చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ వరల్డ్ రికార్డు-వేగంగా చెక్ మేట్ పెట్టి..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు. చదరంగం ఆటలో వేగవంతంగా పావులు కదపడంలో దేవాన్ష్ ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్ ను సాధించడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి సర్టిఫికెట్ అందడంతో నారా కుటుంబం సంతోషంలో మునిగితేలిపోతోంది.
ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికలను పరిష్కరించి దేవాన్ష్ ఈ రికార్డు సాధించాడు.తన వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో నారా దేవాన్ష్ చెక్‌మేట్ మారథాన్ పేరుతో ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాళ్లు విసిరే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. తాజాగా దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమిషం 43సెకన్లలో పూర్తిచేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను మెరుపు వేగంతో సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించారు.

ఇంత చిన్న వయసులో కొడుకు దేవాన్ష్ సాధించిన రికార్డు విజయంపై తండ్రి, మంత్రి లోకేష్ స్పందించారు దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడని, గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి దేవాన్ష్ ప్రేరణ పొందాడని తెలిపారు. దేవాన్ష్ కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
తాజాగా సాధించిన ప్రపంచ రికార్డు ఈవెంట్ కోసం దేవాన్ష్ కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందుతున్నట్లు లోకేష్ తెలిపారు. దేవాన్ష్ కోచ్ కె.రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందిస్తూ దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అన్నారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని పరిష్కరించగలిగిన దేవాన్ష్ మానసిక చురుకుదనం అపారం అని తెలిపారు. దేవాన్ష్ చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని అభివర్ణించారు.












Click it and Unblock the Notifications