ఇంటికి వెళ్లిపోయిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని, ఆ రోజు శ్రీ పద్మావతి యూనివర్శిటిలో !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన తరువాత పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ అమలు చేశారు. పల్నాడు, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితులు అదుపు తప్పకుండా, పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటిలోని స్ట్రాంగ్ రూమ్ సమీపంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడిన పులివర్తి నాని అక్కడే కుప్పకూలడంతో టీడీపీ కార్యకర్తలు ఆయన్ను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాని ఎడమ భుజం, ఛాతి, కాలికి గాయాలు కావడంతో స్విమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానిని మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్. అమరనాథ్ రెడ్డి, చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి దగ్గుమ్ల వరప్రసాదరావు, పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీమూహన్, సిటీ నటుడు శివాజీ స్విమ్స్ కు వెళ్లి నానిని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. తిరుపతిలోని టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా స్విమ్స్ లో ఉన్న పులివర్తి నానిని పరామర్శించారు.
స్విమ్స్ లో చికిత్స పొందిన నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యి ఆయన ఇంటికి వెళ్లారు. శ్రీ పద్మావతి యూనివర్శిటీలో పులవర్తి నానిపై ఇప్పటికే దాడి జరగడంతో ఆయనకు ఎలాంటి హానీ జరగకుండా చూడటానికి ఆయన నివాసం వద్ద తిరుపతి జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు తప్పా వేరే వాళ్లను నాని నివాసం ఉంటున్న ప్రాంతంలోకి పంపించడం లేదు. నాని ఇంటి దగ్గర తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉన్నారు.












Click it and Unblock the Notifications