వారికి జీతంతో పాటు ప్రతీ నెలా రూ 4 వేలు అదనంగా..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ మార్పుల పైన కసరత్తు చేస్తున్నారు. రూ 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ అమలు చేస్తూనే.. భీమా అమలు పైన చర్చించారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే సేవ ల గురించి పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఇక.. 108 సిబ్బందికి ఇకపై జీతానికి అదనంగా రూ. 4000లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
సీఎం సమీక్షలో
సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో పలు అంశాల పైన కసరత్తు చేసారు. ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్స్‌లు ఫిట్‌నెస్ కోల్పోయాయని 2016లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వీటి కోసం రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. అదే విధంగా 104 అంబులెన్స్‌లను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నిషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు.

108 సిబ్బందికి అలవెన్సు
ఇక, 108 సిబ్బంది కొంత కాలంగా తమ సమస్యల పైన ఆందోళన చేస్తున్నారు. తాజా సమీక్ష లో ఈ అంశం పైన చర్చించారు. 108 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారని వీరికి జీతంతో కలిపి అదనంగా రూ.4000లు చెల్లించేవారని అధికారులు గుర్తు చేసారు. కానీ, గత ప్రభుత్వం రూ.2000లు మాత్రమే ఇచ్చింది. దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా రూ.4000లు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. గత ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాల సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా ముఖ్యమంత్రి దానికి కూడా అంగీకరించారు.
ఆరోగ్య శ్రీ సేవలపై
తాజా నిర్ణయం మేరకు 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. దీనికి ఏడాదికి రూ.9.45 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా వేసారు. అదే విధంగా ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎన్టీఆర్ వైద్య సేవలో 3257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ సేవలను భీమా విధానం లోకి తీసుకొచి అమలు చేసే అంశం పైన చర్చించారు. రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications