కీలక బిల్లుల వేళ చంద్రబాబుకు ప్రధాని బిగ్ టాస్క్- ఢిల్లీ కేంద్రంగా..!!
ఢిల్లీలో రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది. నిరసనలతో రాజధాని హోరెత్తుతోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంట్ లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది. పూర్తి మెజార్టీ తో బిల్లులు ఆమోదం పొందేలా వ్యూహ రచన చేస్తోంది. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబుకు కీలక బాధ్యతలు కేటాయించింది. సమన్వయం.. ఓటింగ్ వేళ కొత్త టాస్క్ అప్పగించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. గత సమావేశాల్లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లులను తిరిగి ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ బిల్లులను ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని బీజేపీ నాయకత్వం పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధనపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ఆప్, టీఎంసీ, శివసేన(థాకరే) వర్గం నుంచి ఎంపీలు ఎన్డీఏకు మద్దతుగా నిలిచారు. ఎన్సీపీ సైతం మద్దతు ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో పక్కా ప్రణాళికా బద్దంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. కాగా.. ఈ బిల్లులు ఆమోదం పొందే వరకూ ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు.

కీలక బిల్లుల వేళ సమన్వయ బాధ్యతలు
అందులో భాగంగానే ఢిల్లీ రావాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో.. దీనిపై చర్చించేందుకే ఢిల్లీ పెద్దల ఆహ్వానంపై ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆయన్ను సీఎం ఆహ్వానిస్తారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్తుతో పాటుగా డిప్యూటీ స్పీకర్.. గవర్నర్ పదవుల పైనా చర్చ జరగనుందని సమాచారం. టీడీపీకి ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా చంద్రబాబు తన పర్యటనలో ప్రధాని, అమిత్‌షాతో పాటుగా పీయూష్ గోయల్, మనోహర్‌లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 10.20కి అమరావతి తిరిగి బయల్దేరతారు. ఈ పర్యటనలో తీసుకొనే నిర్ణయాలు.. పదవుల ఖరారు వ్యవహారం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications