సామాన్యుల కోసం.. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సీఎం చంద్రబాబు కీలకనిర్ణయం!!
ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుండి సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు, తాజాగా సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరాఘాతం తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులతో, మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉల్లిపాయలు, కూరగాయలతో పాటు కందిపప్పు, చింతపండు వంటి నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి.
నిత్యావసర వస్తువుల ధరలపై చంద్రబాబు సమీక్ష
సామాన్యులు కొనుగోలు చెయ్యలేనంతగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో నిత్యవసర సరుకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు.రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలపై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లై శాఖ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు.

పప్పులు, కూరగాయలు, ఉల్లిపాయల ధరల నియంత్రణకు
డిమాండ్ కు సరిపడా సరఫరా లేక కంది పప్పు ధర అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. అలాగే టమోటా, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని అధికారులు వెల్లడించారు. సామాన్యులపై ధరల భారం తగ్గించేలా ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సరైన ప్రణాళికతో రావాలని సిఎం అధికారులకు సూచించారు.
అవసరమైతే కేంద్రంతో సంప్రదింపులు
నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు ఆయా సరుకుల దిగుమతుల కోసం అవసరమైన చోట కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుదామని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 122 రైతు బజార్ లు ఉన్నాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అయితే నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదని సిఎం చంద్రబాబు అన్నారు. రైతు బజార్ల నిర్వహణకు సంబంధించి కీలక సూచనలు చేశారు.
సరైన ప్రణాళికలతో రావాలని అధికారులకు ఆదేశం
ధరలు పెరగటానికి గల కారణాలను, ధరలను తగ్గించే విధానాలను, అవసరమైన ప్రత్యామ్నాయాలను అధికారులు అన్వేషించాలని, సరైన ప్రణాళికలతో రావాలని చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు చంద్రబాబు ఏపీ సచివాలయంలో అనేక శాఖల వారీగా వివిధ అంశాలపై కీలక సమీక్షలు నిర్వహించారు. రోడ్ల దుస్థితిపైన, ఇసుక పాలసీపైన కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications