పవన్ కళ్యాణ్ విశాల హృదయానికి ఇదే నిదర్శనం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగురాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక గ్రామాలతో పాటు, పలు ముఖ్య నగరాలలోని అనేక కాలనీలు నీటమునిగాయి. ప్రజలు పునరావాస కేంద్రాలలో తలదాచుకోవలసిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా విజయవాడ వరద ముంపుకు గురికావడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో సంభవించిన ప్రకృతి విపత్తుపై ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు.
వరద సాయంగా పవన్ కళ్యాణ్ భారీ విరాళం
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరద బీభత్సానికి స్పందించి ఏకంగా ఆరు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ప్రకటించారు.

భారీ విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు
అలాగే ఏపీలో వరద బారిన పడ్డ నాలుగు వందల పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంత భారీ విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పైన తెలుగు రాష్ట్రాలలో ప్రజల నుంచి గొప్ప స్పందన వస్తుంది విపత్కర పరిస్థితిలో గొప్ప మనసు చాటిన పవన్ కళ్యాణ్ పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడిన సీఎం చంద్రబాబు
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆయన అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ చంద్రబాబు పోస్ట్ పెట్టారు. వరదల కారణంగా కష్టాలలో ఉన్న ప్రజలకు పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలు నిరుపమానమని కొనియాడారు.
పవన్ కళ్యాణ్ విశాల హృదయానికి ఇదే నిదర్శనం
వరద ప్రాంతాల ప్రజలకోసం ఎంతో ఉదాత్తంగా భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు నా అభినందనలు అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు, వరద బారిన పడ్డ నాలుగు వందల పంచాయతీలకు 4కోట్లు, తెలంగాణ వరదప్రాంతాలలో సహాయకార్యక్రమాలు చేసేందుకు మరో కోటి రూపాయలు ఇవ్వడం ఆయన విశాల హృదయానికి అద్దం పడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
పవన్ సేవలకు విలువ కట్టలేం
దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ కళ్యాణ్ సమాజంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారన్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేమని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదని పేర్కొన్నారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పట్ల తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల కష్ట కాలంలో అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ నిజంగా ఎంతో మందికి ప్రేరణనిస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications