అమరావతి మహిళలపై వ్యాఖ్యలు- అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం
Chandrababu: అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.
ఈ వ్యాఖ్యల ఉదంతంపై తాజాగా చంద్రబాబు స్పందించారు. రాజధాని అమరావతి, ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అత్యం కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా ముసుగులో ఓ వికృత పోకడగా అభివర్ణించారు.

ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి, స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనదని చంద్రబాబు చెప్పారు. అదే మన సంప్రదాయమని గుర్తు చేశారు. మహిళలను గౌరవించుకోవడమే మన భారతీయ జీవన విధానమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తామని చెప్పారు.
అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని చంద్రబాబు అన్నారు. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టమైందని పేర్కొన్నారు.
రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూరకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారని అన్నారు. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications