రీల్ స్టార్ పై రియల్ స్టార్ ను పోటీకి నిలబెడుతున్నా - సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. భీమవరం పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసిన వారిని చూసి ఉండమంటూ ఎద్దేవా చేసారు. ఇటు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దుల మార్పు పై కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి భీమవరం లో తమ అభ్యర్దిని ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లొ పోటీ చేస్తారని ప్రకటించారు.
భీమవరం లో మరోసారి
ముఖ్యమంత్రి జగన్ భీమవరంలో పర్యటించారు. విద్యాదీవెన నిధులు విడుదల చేసారు. అక్కడి నుంచే పవన్ కల్యాణ్ వివాహ బంధంకు ఇచ్చే విలువ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. భీమవరం తిరస్కరించిన నేతగా పవన్ ను అభివర్ణించారు. గత ఎన్నికల్లో పవన్ ను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను తిరిగి అభ్యర్దిగా జగన్ ఖరారు చేసారు. మరోసారి రీల్ స్టార్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారని.. చేసినా, చేయకున్నా.. రియల్ స్టార్ గా ప్రజల కోసం పనిచేసే గ్రంధి శ్రీనివాస్ ను అప్పగిస్తున్నానని జగన్ చెప్పుకొచ్చారు. గ్రంధి శ్రీనివాస్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా..భీమవరం జిల్లా కేంద్రం కావాలని కోరారని వెల్లడించారు. సభా వేదికగా ఎమ్మెల్యే అడిగిన వినతులకు జగన్ ఆమోదం తెలిపారు.

పవన్ పై జగన్ కామెంట్స్
పవన్ కల్యాణ్ గురించి మరోసారి సీఎం స్పందించారు. ఈ దత్తపుత్రుడి శాశ్వత నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందన్నారు. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్క వాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఈయనే. దేశంలో ఎవరూ ఇలా ఉండరని ఎద్దేవా చేసారు. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే మాకు వందల కోట్లు అన్నట్లుగా, బాబు కోసమే తన జీవితమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నా రని పేర్కొన్నారు. దీనికి అంగీకరించని వారు తన పార్టీలో ఉండకూడదు అని, వేరే అభిప్రాయం ఉండదని తన సభల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారని వివరించారు. ఈ దత్తపుత్రుడికి పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకే, ఇవ్వకపోయినా ఓకే..చిత్తం ప్రభు అంటూ త్యాగాల త్యాగరాజును ఈ దత్తపుత్రుడిలో చూస్తామంటూ వ్యాఖ్యానించారు.
త్యాగాల మ్యారేజ్ స్టార్
ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసిన వారిని చూడలేదని చెప్పుకొచ్చారు.ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం మూడేళ్లు కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజీ స్టార్. ఆడవాళ్లను కేవలం ఆట వస్తువుగా చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం మళ్లీ విడాకులు ఇచ్చేయడం..ఏకంగా కార్లను మార్చినట్లు భార్యలను మార్చుతున్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలను వదిలేశారని ధ్వజమెత్తారు. పొలిటికల్ లైఫ్‌లో మాత్రం చంద్రబాబు కనీసం 10, 15 ఏళ్లు ఉండాలని తన క్యాడర్‌కు ఇదే మాటలు చెబుతున్నాడు. చంద్రబాబుతో వివాహ బంధం కనీసం 15 ఏళ్లు ఉండాలంటున్నారని చెప్పారు. ఇలాంటి వారికి ఓట్లు వేస్తారా అని సీఎం జగన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications