అల్పపీడనం కేంద్రీకృతం- ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్ కు ఛాన్స్: కంట్రోల్ రూమ్ నంబర్లు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల కిందటే ఏపీలో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది.
తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతోంది.

క్రమంగా ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
ఈ అల్పపీడన ప్రభావం వల్ల నేడు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చు. అధిక వర్షపాతం నమోదు కావొచ్చు.
ఈ అల్పపీడన ప్రభావం ప్రత్యేకించి- కృష్ణా జిల్లాపై అధికంగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. అలాగే- ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అల్పపీడన ప్రభావం వల్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆ సమయంలో మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.
పరిస్థితి తీవత్రను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది విపత్తు నిర్వహణ సంస్థ. దీని టోల్ ఫ్రీ నంబర్లు.. 112, 1070, 18004250101. వర్షాలు కురిసే సమయంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.












Click it and Unblock the Notifications