పవన్.. మరో ఛత్రపతి
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోన్నాయి.
ఓటర్లను ఆకట్టుకోవడంలో సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి. మహాయుటి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సహా బీజేపీ సీనియర్లందరూ ప్రచారబరిలో దూకారు. మహా వికాస్ అగాఢీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే హోరాహోరి ప్రచారం సాగిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహాయుటి అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది.
ఈ నెల 16, 17 తేదీల్లో మరాఠ్వాడా, విదర్భ, మహారాష్ట్ర పశ్చిమ ప్రాంత జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. ఆయా ప్రాంతాల్లో తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసిస్తోండటమే దీనికి కారణం. ఈ రెండు రోజుల్లో ఆయన సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తారు.
ఔరంగాబాద్, బీడ్, హింగోళి, జాల్నా, లాతూర్, నాందెడ్, ఉస్మానాబాద్, పర్భణీ, అకోలా, అమరావతి, భండారా, బుల్ధానా, చంద్రాపూర్, గడ్చిరోలి, గోండియా, నాగ్‌పూర్, వార్ధా, వషీం, యావత్మల్, కొల్హాపూర్, సాంగ్లి, సతారా, పుణే, షోలాపూర్, నాసిక్, అహ్మద్‌నగర్‌లల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో పవన్ రోడ్ షోలను నిర్వహించే అవకాశం ఉంది.
పర్యటన ఖరారైన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పేరిట పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ఆయనను మరో ఛత్రపతిగా అభివర్ణిస్తూ బ్యానర్లు కడుతున్నారు మహాయుటి నాయకులు.












Click it and Unblock the Notifications