వంగవీటి రాధాపై వైసీపీ అభ్యర్ధి ఆయనేనా? కీలకంగా కుల సమీకరణం- జగన్ ఛాయిస్..!
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికల్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు సీట్లలో అధికార కూటమికీ, విపక్ష వైఎస్సార్సీపీకి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇలాంటి హాట్ సీట్లలో ఒకటైన విజయవాడ మేయర్ సీటుకు ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా కూటమిని నడుపుతున్న టీడీపీలో దాదాపు 15 మంది అభ్యర్ధులు పోటీ పడటంతో చివరకు ఈ సీటును జనసేనకు ఇచ్చేసింది. దీంతో టీడీపీలోనే ఉన్న వంగవీటి రాధాను జనసేనలోకి పంపి మరీ విజయవాడ మేయర్ సీటుకు పోటీ చేయించబోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో కుల సమీకరణాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
గతంలో కాపు నేత వంగవీటి రంగా హత్య తర్వాత ఓసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆయన కుమారుడు వంగవీటి రాధ (Vangaveeti Radha) ఆ తర్వాత మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీఆర్పీలోకి, తర్వాత వైసీపీలోకి మళ్లీ టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి మారుతున్న వంగవీటి రాధకు అప్పటి నుంచీ ఏ పదవీ దక్కలేదు. మధ్యలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు వచ్చినా వాటిని గెలుపుగా మార్చుకోలేకపోయారు. ఇప్పుడు కీలకమైన విజయవాడ మేయర్ సీటులో రాధాను నిలబెట్టేందుకు కూటమి సిద్దమవుతోంది. దీంతో అటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా వంగవీటి కుటుంబం అంటేనే భగ్గుమనే దేవినేని కుటుంబం నుంచి అభ్యర్ధిని నిలబెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

జనసేన నుండి కూటమి మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో దేవినేని కుటుంబ వారసుడు, ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్న అవినాష్ (Devineni Avinash) తో పోటీ చేయించేందుకు జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అవినాష్ అయితేనే వంగవీటి రాధాకు విజయవాడ మేయర్ స్ధానంలో గట్టి పోటీ ఇవ్వగలడని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు దేవినేని అవినాష్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. విజయవాడలో అభ్యర్ధుల గెలుపోటముల్ని నిర్ణయించే కమ్మ సామాజిక వర్గాన్ని కాదని, కూటమి భాగస్వామి అయిన జనసేనకు అండగా నిలిచే కాపు సామాజిక వర్గం నుంచి మేయర్ అభ్యర్ధిని ఎంపిక చేస్తున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గంలో ఉండే అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు అవినాష్ ను జగన్ రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.














Click it and Unblock the Notifications
