చంద్రబాబును అరెస్టు చేసిన కొల్లి ఔట్, సిట్ కు సీల్ - రంగంలోకి గవర్నర్..!!
ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల పైన చర్యలు మొదలయ్యాయి. సచివాలయంలోని కీలక శాఖల్లో ముఖ్య సమాచారం బయటకు పోకుండా ఆదేశాలు జారీ అయ్యాయి. స్వయంగా గవర్నర్ నిఘా పెంచాలని ఆదేశాలు జారీ చేసారు. చంద్రబాబును అరెస్టు చేసిన సిట్ అధిపతి కొల్లి రఘురామి రెడ్డికీ షాక్ ఇచ్చారు. డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేసారు.
గవర్నర్ ఆదేశాలు
సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా పెంచాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశించారు. ఆ వెంటనే జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేశ్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు.. కార్యదర్శులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్ సర్కారు ఏర్పాటు చేసిన 'సిట్' కార్యాలయానికి కూడా బుధవారం తాళం పడింది. అడిషనల్ కమాండెంట్ బెటాలియన్స్ ప్రకాశ్ నేతృత్వంలోని బృందం ఆధ్వర్యంలో సిట్ ఆఫీసు ప్రధాన ద్వారానికి సీల్ పడింది.

కొల్లి పై చర్యలు
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన 'సిట్' అధిపతి కొల్లి రఘురామి రెడ్డికీ షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేశారు. జగన్ హయాంలో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, సిట్ అధిపతిగా ఉన్న కొల్లి రఘురామి రెడ్డి పనిచేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఈ అధికారి వ్యవహార శైలి పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
సిట్ కు సీల్
గత ప్రభుత్వంలో వివాదాస్పద భూ కేటాయింపులు, అక్రమ బదిలీలు, పదోన్నతులు, టెండర్ ప్రక్రియల్లో అవినీతి జరిగాయన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించిన ఫైళ్లను కొత్త సర్కారు కొలువుతీరేలోపే మొత్తంగా ధ్వంసం చేసే అవకాశముండటంతో గవర్నర్ రంగంలోకి దిగారు. ఫైళ్లు మొత్తం భద్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయం ఐదు బ్లాకుల్లోని వివిధ కార్యాలయాలు, అందులోని సామగ్రి వివరాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో వారంరోజులుగా ఫైళ్ల కదలికల తీరును పరిశీలించినట్టు తెలిసింది. ఈ-ఆఫీస్ గది వద్ద పోలీసులను కాపలా ఉంచారు.












Click it and Unblock the Notifications