"నెక్స్ట్ సీఎం" పై పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!!
ఉప ముఖ్యమంత్రి పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ వేదికగా 150 రోజుల కూటమి పాలన పైన స్పందించారు. సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించిన పవన్ .. వైసీపీ హయాంలో జరిగిన నష్టాలను వివరిం చారు. మరో పదేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలంటూ కొత్త చర్చకు తెర తీసారు.
చంద్రబాబు పై ప్రశంసలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తి కావటంతో సాధించిన పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఆ తరువాత డిప్యూటీ సీఎం పవన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. వైసీపీ హయాంలో అన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. పంచాయితీలను నిర్వీర్యం చేసారని ఆరోపించారు. రోడ్లను పట్టించుకోలేదని .. ఇసుక, మద్యం లో దోపిడీ జరిగిందని చెప్పుకొచ్చారు. కూల్చివేతల పైన ప్రజాగ్రహం తీవ్ర స్థాయిలో కనిపించిందని పవన్ వివరించారు.

కూటమి హయాంలో
వైసీపీ వ్యవహార శైలి కారణంగానే ప్రజలు కూటమికి మద్దతుగా నిలిచారని పవన్ విశ్లేషించారు. రాష్ట్ర భవిష్యత్తుపై చంద్రబాబు విశ్వాసం పెంచారని చెప్పుకొచ్చారు. ఈ అంశంలో తనకు సీఎం చంద్రబాబు పైన పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అందుకుంటుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నారని వివరించారు. రాష్ట్రంలోని 64 లక్షల మంది లబ్దిదారులకు రూ 4 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు. పంచాయితీలను బలోపేతం చేశామని చెప్పారు.
పవన్ వ్యాఖ్యలతో
అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన విధంగా అన్ని రకాల సహకారం అందుతుందని పవన్ వెల్లడించారు. రాజధాని, పోలవరం తో పాటుగా రోడ్లు - రైల్వే లైన్ల కోసం వేల కోట్లు కేంద్రం కేటాయించిందని వివరించారు. వైపరీత్యాలు వచ్చిన సమయంలో నాయకుడు ఎలా ఉండాలో విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు నిరూపించారని ప్రశంసించారు. చంద్రబాబు ఇదే స్పూర్తిని కొనసాగించాలని పవన్ కోరారు. మరో పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది. పవన్ వ్యాఖ్యల వెనుక పరమార్థం ఏంటనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications