El Nino: కర్నూలులో తీవ్ర కరువు.. ఊళ్లకు ఊళ్లే ఖాళీ!
కర్నూలు జిల్లాను కరువు రాక్షసి కోలుకోలేని దెబ్బతీసింది. ఎల్ నినో ప్రతికూల ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో పంటలన్నీ ఎండిపోయి పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. జిల్లాలోని సాగు భూముల్లో సుమారు 80 శాతానికి పైగా కేవలం వర్షధార పద్ధతులపైనే ఆధారపడి ఉండటంతో, వరుణుడి కటాక్షం లేక సీమ రైతాంగం తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయింది.
తొలకరిలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు ఆశపడి రైతులు పత్తి, కందులు, ఆముదం వంటి పంటలను విత్తుకున్నారు. విత్తనాలు, ఎరువులు, దుక్కుల కోసం ఎకరాకు రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు పెట్టుబడులు పెట్టారు. కానీ జులై, ఆగస్టు నెలల్లో చుక్క నీరు కూడా పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. విలవిలలాడుతున్న పంటలను కాపాడుకోవడానికి 800 నుంచి 1000 అడుగుల లోతు వరకు బోర్లు తవ్వించినా చుక్క నీరు పడలేదు. దీనితో ఎకరాకు సగటున రూ. 50,000 వరకు నష్టం వాటిల్లి, రైతులు కట్టలేనంత అప్పుల ఊబిలో పడిపోయారని జాతీయ మీడియా సంస్థలు వార్తను ప్రచురించాయి.

దసరా తర్వాత మరిన్ని వలసలు.. నగరాల బాట పట్టిన బతుకులు!
పంటలు చేతికి రాకపోవడం, స్థానికంగా కూలీ పనులు దొరకకపోవడంతో బతుకుదెరువు గ్రామాలు ఖాళీ చేసి వెళ్తున్నారు రైతన్నలు. ఇప్పటికే సుమారు 10,000 వ్యవసాయ కుటుంబాలు ఊళ్లను వదిలి వెళ్లగా, దసరా పండుగ పూర్తయిన తర్వాత మరో 50,000 కుటుంబాలు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, నందవరం, కోసిగి, చిప్పగిరి, కౌతాళం, సీ బెళగల్, కోడుమూరు, మంత్రాలయం వంటి 12 మండలాల నుంచి ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, చెన్నై, ముంబై, దిల్లీ వంటి నగరాలకు కట్టకట్టుకుని వలస పోతున్నారు.
సగం మండలాలకే కరువు ప్రకటన.. సర్కారు సాయం కోసం రైతుల ఆవేదన!
జిల్లాలో జులైలో 56 శాతం, ఆగస్టులో 57 శాతం వర్షపాత లోటు నమోదైందని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 15 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని మొత్తం 27 మండలాల్లోనూ తీవ్ర కరువు తాండవిస్తోందని, మిగిలిన మండలాలను మినహాయించడం వల్ల ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా నష్టపరిహారం, రుణాల రీషెడ్యూల్, పశుగ్రాసం సబ్సిడీ వంటి ప్రయోజనాలను కోల్పోతామని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధి హామీ పనులు కూడా సరిగ్గా సాగడం లేదని, ప్రస్తుత రేట్లకు వచ్చే రోజువారీ కూలీ ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు.














Click it and Unblock the Notifications
