కల్తీ నెయ్యి కేసులో ఊహించని మలుపు, ఇక నెక్స్ట్..!!
కల్తీ నెయ్యి కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిట్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. సిట్ నివేదిక ఆధారంగా రాజకీయ విమర్శలు పతాక స్థాయికి చేరాయి. సిట్ నివేదిక ఆధారంగా గతంలో నూ ఈవో గా పని చేసిన ఈవో అనీల్ కుమార్ సింఘాల్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇదే సమయంలో ఈ కేసులో చోటు చేసుకున్న తాజా పరిణామం సంచలనంగా మారుతోంది.
తిరుమల నెయ్యి వివాదం లో ఇప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును సిట్ విచారణ చేసి.. అనేక అంశాలను గుర్తించింది. రూ.235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తాల్లో సొమ్ము చేతులు మారినట్లు పేర్కొంది. దీంతో, ఈ వ్యవహా రంలో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్ నుంచి తాజాగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్టులు, ఇప్పటివరకూ దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర తదితర అంశాలపై సమాచారం తీసుకుని ఈడీ విచారణకు సిద్దం అయింది. ఈ కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భావిస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ వివరాలు కోరింది. పూర్తి సమాచారం రాబట్టేందుకు సిద్దమైంది.

నగదు లావాదేవీల పై ఆరా
సిట్ విచారణలో టీటీడీకి నెయ్యి సరఫరా వివరాలు... ఏ సంస్థ నుంచి ఎంత మేర సరఫరా చేసారు.. అందులో నాణ్యత ఎంత వంటి అంశాల పైన పూర్తి స్థాయి సమాచారం సేకరించింది. తమ సంస్థతో పాటు వైష్ణవి, ఏఆర్, మాల్‌గంగా డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసిన భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లు ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, దిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లోని పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చెల్లింపులు జరిగినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందీ... ఎవరికి నగదు ముట్టిందీ వంటి అంశాల పైన ఆరా తీస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలాతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బు ఏం చేశారు ఎక్కడికి మళ్లించారు అనేది ఈడీ దర్యాప్తు చేయనుంది. దీంతో.. ఈడీ ఇప్పుడు ఎవరికి నోటీసులు ఇవ్వనుంది.. ఏం తేల్చనుందీ.. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications