చంద్రబాబు మార్కెటింగ్ ప్రయివేట్ లిమిటెడ్!!
ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు సవతి ప్రేమ ఉందని, ఈ ప్రాంతానికి ఆయన ఏనాడు న్యాయం చేయలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు 30 రోజుల పాలన ఒక మోసమన్నారు.
చంద్రబాబు అందులో దిట్ట
ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలను అమలు చేయడం మరిచిపోయి ప్రత్యర్థి పార్టీలపై నిందలు వేయడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు.తల్లికి వందనం పథకంలో చంద్రబాబు వంచన అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. మార్కెటింగ్ లో చంద్రబాబును మించిన దిట్ట ప్రపంచంలోనే ఎవరూ లేరని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చంద్రబాబు అలానే ప్రచారం చేసుకుంటున్నారని గుర్తు చేశారు.

ఇందులో చంద్రబాబును మించినవారు లేరు
సీఎం హోదాలో ఉత్తరాంధ్రకు వచ్చిన చంద్రబాబు తాను ఈ ప్రాంతానికి ఏం చేస్తానో చెప్పకుండా కేవలం జగన్ ని నిందించటమే పనిగా పెట్టుకుని మాట్లాడారని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ తమ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్ తాము చేసిన పనిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. అన్ని తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని పేర్కొన్న అమర్నాథ్, ఇలా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు.
టీడీపీ కూటమి సర్కార్ ను తూర్పారబట్టిన గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీపీసీఎల్ కొత్తగా రాలేదని, గత ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వ హయాంలోనే వారు వచ్చారని పేర్కొన్నారు. అది కూడా చంద్రబాబు సాధించిన ఘనత కాదని స్పష్టం చేశారు. జీవో 29 ఒక దగా అని తల్లికి వందనం పేరుతో మోసం చేస్తున్నారని, ఉచిత ఇసుక ఒక బూటకం అని, వాలంటీర్ల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
చంద్రబాబు ఆ ఆలోచనైనా ఎప్పుడైనా చేశారా?
చంద్రబాబు తన పర్యటనలో గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ఏమీ చేయనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మూలపేట పోర్టు, పది ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలల నిర్మాణం వంటివి 14 ఏళ్ళు సీఎం గా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా కనీసం ఆలోచనైనా చేశారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.












Click it and Unblock the Notifications