పవన్ సినిమా మార్కెట్ ఎంత - వారాహి ఏమైంది..!!
జనసేనాని పవన్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ను తిట్టేందుకే రోడ్ల మీదకు వస్తున్నారని ఆరోపించారు. పదేళ్ళలో పట్టుమని వరుసగా పది రోజులు పవన్ ప్రజల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు పవన్ సినిమా మార్కెట్ రేటు ఎంత అని పేర్ని నాని ప్రశ్నించారు.
పొత్తుల రాజకీయం: ఏపీలో పొత్తుల రాజకీయం వేడెక్కింది. జనసేనాని పొత్తుల పైన ఓపెన్ అయ్యారు. టీడీపీ, బీజేపీతో పొత్తుల దిశగా చర్చలు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. బీజేపీ ఒప్పుకోకుంటే ఒప్పించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేసారు. ఇప్పుడు బీజేపీ అంగీకరిస్తే మూడు పార్టీలు..లేకుంటే రెండు పార్టీల పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ చెబుతన్న పవన్ వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ ముఖ్య నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని జనసేనాని లక్ష్యంగా ప్రశ్నలు సంధించారు. టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు.

వారాహి ఏమైంది: పవన్ పర్యటన పేరు రైతులది.. చేస్తుంది చంద్రబాబుకు అనుకూల రాజకీయం అంటూ పేర్ని నాని కామెంట్స్ చేసారు. కాపులను బీసీల్లో చేర్చుతామన్న చంద్రబాబు హామీ ఏమైందని నిలదీసారు. ముద్రగడను చంద్రబాబు ఇబ్బంది పెట్టిన సమయంలో పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు తన చేతుల్లో లేదని జగన్ ఎన్నికల ముందే ధైర్యంగా చెప్పారని గుర్తు చేసారు. చంద్రబాబు కోసమే పవన్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎవరో టీ కొట్టు అతను వ్యాన్ ఇస్తే వారాహి అని పేరు పెట్టారని పవన్ ను ఎద్దేవా చేసారు. ఆ వారాహి ఏమైందని ప్రశ్నించారు. వీకెండ్ లో రావటం సీఎం ను తిట్టటం మళ్లీ విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోవటం పవన్ కు అలవాటుగా మారిందన్నారు.

చిరంజీవి పేరెత్తటం లేదు: భీమ్లా నాయక్ సినిమాకు జగన్ 30 కోట్లు నష్టం కలిగించారని అబద్దాలు చెప్పాడని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సినిమా మార్కెట్ ఎంత అని ప్రశ్నించారు. పవన్ ఏమైనా పెట్టుబడి పెట్టారా అని నాని నిలదీసారు. సినిమా బాగోకపోతే ప్రజలు ఎందుకు చూస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, జగన్ కు ఏం సంబంధం ఉంటుందో చెప్పాలని డిమాండ్ చేసారు. వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేస్తే జనాలు చూస్తారని చెప్పిన పేర్ని నాని..చిరంజీవి వల్ల సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు కూడా ఎత్తటం లేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications