ఏపీలో మొదటి ఒమిక్రాన్ కేసు : విజయనగరంలో నిర్ధారణ : విదేశాల నుంచి వచ్చిన యువకుడు ...!!
ఒమిక్రాన్ ఏపీలోనూ ప్రవేశించింది. దక్షిణాఫ్రికా లో గుర్తించిన ఓమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అనేక దేశాల్లో విస్తరిస్తున్న ఈ వేరియంట్ భారత్ లో క్రమేణా పెరుగుతోంది. బెంగుళూరులో తొలుత గుర్తించిన ఒమిక్రాన్ కేసు తరువాత ఢిల్లీ... గుజరాత్.. మహారాష్ట్రకు వ్యాపించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక, ఇప్పుడు ఏపీకి చెందిన వ్యక్తిలో ఒమిక్రాన్ ను గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు.

విజయనగరం లో తొలి ఓమిక్రాన్ కేసు
ఐర్లాండ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి ఒమిక్రాన్ వ్యాధి సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి పైన అధికారులు నిఘా పెట్టారు. మొత్తం 15 మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చిన తరువాత వారిలో కోవిడ్ పాజిటివ్ గుర్తించారు. దీంతో.. వారి శాంపిల్స్ జీయోన్ సీక్వెన్సింగ్ కు పంపారు. అక్కడ ఆ 15 మందిలో 34 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చారు. మిగిలిన వారికి సంబంధించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.

ముంబాయిలో నెగటివ్..ఇక్కడ పాజిటివ్
వీరు విదేశాల నుంచి ముంబాయి చేరుకున్న సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో వారికి నెగటివ్ రిపోర్టు వచ్చింది. కాగా, ఏపీకి వచ్చిన తరువాత మరోసారి పరీక్షలు చేయగా, పాజిటివ్ గా తేలింది. దీంతో..నమూనాలను పరీక్ష కోసం పంపగా ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఈ సమాచారంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి రూమర్స్ నమ్మవద్దు.. భయాందోళనకు గురికావద్దని ప్రభుత్వం సూచించింది.

ఒమిక్రాన్ గా నిర్దారించిన వైద్య ఆరోగ్య శాఖ
అదే సమయంలో ప్రజలందరూ మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. దీంతో..ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ నిర్దారణ అయిన వారి సంఖ్య 34కు చేరింది. ఏపీకి గత కొంత కాలంగా వస్తున్న విదేశీ ప్రయాణీకుల పైన ప్రభుత్వం నిఘా కొనసాగిస్తోంది. అయితే, జీనోమ్ సీక్వెన్సీకి పంపిన నమూనాల్లో మరో పది మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. ఏపీలో అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవటంతో...ఇతర రాష్ట్రాల విమానాశ్రయాల్లో దిగి రాష్ట్రానికి చేరుకున్న వారికి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications