నల్లారికి కీలక పదవి కోసం చంద్రబాబు సిఫార్సు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక సమయంలో నువ్వా నేనా అన్నట్లుగా చిత్తూరు జిల్లాలో రాజకీయం చేసిన చంద్రబాబు - నల్లారి ఇప్పుడు ఒకటయ్యారు. తాజా ఎన్నికల్లో నల్లారి సోదరులు పోటీ చేసారు. కిషోర్ ఎమ్మెల్యేగా గెలవగా..కిరణ్ ఎంపీగా ఓడారు. కిరణ్ కోసం చంద్రబాబు ప్రచారం చేసారు. ఇప్పుడు అదే నల్లారి కిరణ్ కు కీలక పదవి కోసం చంద్రబాబు సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుతో భేటీతో
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉంటూ సీఎం అయిన కిరణ్..రాష్ట్ర విభజనను తాను చివరి బంతితో ఆపుతానంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో సీఎం పదవితో పాటుగా కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. ఆ తరువాత కొత్త పార్టీ పెట్టి విఫలమయ్యారు. తిరిగి కాంగ్రెస్ లో చేరినా వెంటనే దూరమయ్యారు. చివరకు బీజేపీలో చేరిన కిరణ్ తాజా ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఇప్పుడు కిరణ్ కీలక పదవి కోరుకుంటున్నారు.

రాజ్యసభ సీటు కోసం
ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో భాగంగా టీడీపీకి రెండు, జనసేనకు ఒకటి దక్కుతుందనే వాదన ఉంది .అయితే, తాజాగా చంద్రబాబుతో కిరణ్ భేటీ అయ్యారు. మూడు రాజ్యసభ స్థానాల్లో క్రిష్ణయ్య బీజేపీలో చేరే అవకాశం ఉండటంతో..ఆయన సీటు బీజేపీకి కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు పార్టీలకు మూడు స్థానాలు దక్కేలా చర్చలు చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీజేపీ నుంచి కిరణ్ ఆ స్థానంలో రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు. ఇదే అంశం పైన చంద్రబాబుతో చర్చించారు. వచ్చే వారం మూడు రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
కిరణ్ కు ఛాన్స్ దక్కేనా
మాజీ సీఎంగా పని చేసిన కిరణ్..ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఉన్నారు. ఏపీ నుంచి ప్రస్తుతం బీజేపీకి ఎవరూ రాజ్యసభ సభ్యులు లేరు. టీడీపీ, జనసేన నుంచి గల్లా జయదేవ్, నాగబాబు పేర్లు ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీంతో, రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటే తనకు అవకాశం ఇవ్వాలని కిరణ్ కోరుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలోనూ రాయలసీమకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో..చంద్రబాబు సైతం హామీ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్న వేళ.. మూడు రాజ్యసభ స్థానాల ఖరారులో చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications