సుచరితకు తత్వం బోధపడింది- జగన్ జన్మదినాన కీలక సంకేతం
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ 50వ పుట్టిన రోజును జరుపుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు జగన్‌కు విషెస్ చెప్పారు.

బర్త్‌డే శుభాకాంక్షల హోరు..
వైఎస్ జగన్ 50వ జన్మదినాన్ని వైభవంగా జరుపుకొన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. సోషల్ మీడియాలో ఆయన పేరు హోరెత్తిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఆయనకు విషెస్ చెబుతూ వేర్వేరు హ్యాష్ ట్యాగ్స్‌తో లక్షల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. అదే స్థాయిలో వీడియోలు రీట్వీట్లు అయ్యాయి.

క్యాంప్ ఆఫీస్‌లో..
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. మంత్రులు ఆర్ కే రోజా, విడదల రజిని, తానేటి వనిత, జోగి రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నవతరం ఫులేగా..
కాగా వైఎస్ జగన్‌కు హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత తెలిపిన బర్త్‌డే విషెష్ అందరి దృష్టినీ ఆకర్షించింది. జగన్‌ను ఆమె నవతరం ఫులేగా అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనతో జగన్ పాలనను పోల్చారు. నాడు రాజన్న మూడు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పితే నేడు జగనన్న 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తూ విద్యారంగంలోనే చరిత్ర సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నవతరం 'పూలే' మన జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

వైసీపీకి దూరంగా..
నిజానికి- సుచరిత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటోన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని కోల్పోయినప్పటి నుంచీ పెద్దగా వార్తల్లోనూ లేరు. పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ క్రియాశీలకంగా లేరంటూ జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరిగింది అప్పట్లో. తనను మంత్రివర్గం నుంచి తొలగించడం పట్ల అలిగారని, పార్టీని వీడుతారని కూడా గతంలో వార్తలొచ్చాయి. ఈ పరిస్థితుల మధ్య ఆమె జగన్‌ను నవతరం ఫులేగా అభివర్ణిస్తూ బర్త్‌డే విషెష్ తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను పార్టీలోనే కొనసాగుతున్నాననే సంకేతాన్ని పంపించినట్టయింది.












Click it and Unblock the Notifications