ఎపి శాసనసభ భవనానికి 30న శంకుస్థాపన: ఉదయం 8.26 గంటలకు ముహూర్తం

Subscribe to Oneindia Telugu

అమరావతి: రాజధాని అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ రోజున శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30న ఉదయం 8.26 గంటలకు శాసనసభ భవనం, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించిన పైల్‌ ఫౌండేషన్‌ పనులకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం టెండరు ప్రకటన జారీ చేసింది.

రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పిలిచారు. ఈ నెలాఖరున విడిగా ప్రకటన జారీ చేయనున్నారు. శాసనసభ భవన ఆకృతి స్థూలంగా ఖరారైంది. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ కోహినూర్‌ వజ్రాన్ని పోలిన విధంగా ఆకృతి రూపొందించింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడకు వస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారులతో ప్రాథమిక చర్చలు, సమావేశాలు అనంతరం ఈ నెల 13న ముఖ్యమంత్రితో సమావేశమవుతారు.

Foundation stone for AP assembly building on Sep 30

అదే రోజున హైకోర్టు భవన తుది ఆకృతిని అందజేస్తారు. ముందుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులతో సమావేశమై డిజైన్ల గురించి వివరిస్తారు. హైకోర్టు ఆకృతిని స్థూపాన్ని పోలిన విధంగా రూపొందిస్తున్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ (హెచ్‌ఓడీ) భవనాల ప్రాథమిక ఆకృతుల్ని కూడా అదే రోజు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అందజేయనుంది.

శాసనసభ భవనం ఎత్తు 42 మీటర్లు...! మొత్తం శాసనసభ భవనం కోహినూర్‌ ఆకృతిలా కనిపించేలా, భవనం మధ్య ప్రాంతం (సెంట్రల్‌ అట్రియం) వజ్రం ఆకృతిలో ఉండేలా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రెండు భిన్నమైన ఆకృతుల్ని సిద్ధం చేయగా... అందులో ఒక దానిని ఖరారు చేస్తారు. వైశాల్యం, అంతర్గత రూపం, ఎవరి గదులు ఎక్కడ ఉండాలి వంటివన్నీ ఖరారయ్యాయి.

నిర్మిత ప్రాంతం 11 అక్షల చ.అడుగులు. ఎత్తు 42 మీటర్లు ఉంటుంది. మొత్తం నాలుగు అంతస్తులుగా దీన్ని నిర్మిస్తారు. మొదటి అంతస్తులో ఐదు ప్రధాన భాగాలుంటాయి. ఒక దానిలో శాసనసభ, మరో దానిలో శాసన మండలి, మూడో దానిలో సెంట్రల్‌ హాల్‌, నాలుగో భాగంగా కార్యాలయాలు, ఇతర సదుపాయాలు వంటివి ఉంటాయి. ఈ నెలాఖరుకి టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. హైకోర్టు భవన ప్రాథమిక ఆకృతులు ఇది వరకే సిద్ధమయ్యాయి. 13న తుది ఆకృతిని ఖరారు చేయనున్నారు. 18-19 లక్షల చ.అడుగుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తారు.

ప్రతి భవనంలో ఐదు వేల మంది..! సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలకు ఆకృతులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఏడు భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో దానిలో ఐదు వేల మంది ఉద్యోగులు ఉండేలా రూపొందిస్తున్నారు. ఇలా నిర్మిస్తే.... ఎలాంటి వసతులు సమకూర్చాలి? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వంటి అంశాలపై సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. గూగుల్‌ కార్యాలయ భవనం కంటే బాగుండాలని సీఎం నిర్దేశించారని దానికి అనుగుణంగానే ఆకృతులు రూపొందిస్తున్నామని శ్రీధర్‌ తెలిపారు.

ఈ భవనాలను మొత్తం 40 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా నిర్మిస్తారు. పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు నిర్మించే ప్రభుత్వ క్వార్టర్లకు సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. సుమారు 4 వేల ఫ్లాట్లు నిర్మించనున్నారు. వీటికీ ఈ నెల 30న సీఎం శంకుస్థాపన చేస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu will lay foundation stone for AP assembly building on September 30.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X