సీఎం చంద్రబాబు ఆశలకు కొత్త రెక్కలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ దశ మారుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు అంతర్జాతీయ సంస్థలు రాబోతున్నాయని ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ ఏర్పాటు జరిగిన తర్వాత తాజాగా ఎయిర్ బస్ సంస్థ అనంతపురంలో హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి.
హెచ్ 125హెలికాప్టర్ల కోసం అసెంబ్లింగ్ లైన్ ప్లాంట్ కోసం పరిశీలనలో ఏపీ
ఎయిర్ బస్ హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు నిజమైతే ఇది అనంతపురం జిల్లా వాసులకు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ సంస్థ భారత దేశంలో హెచ్ 125హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ ప్లాంట్ ఏర్పాటుకు దేశంలో ఎనిమిది ప్రదేశాలను పరిశీలన చేస్తున్నారని, ఈ ఎనిమిది ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని సమాచారం.

ఈ ఏడాది చివర్లో భూమిపూజ..2026 నుంచి కార్యకలాపాలు
అయితే ఈ 8 ప్రదేశాలలో త్వరలో ఒకదానిని ఎంపిక చేసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో అనంతపురంలో కూడా స్థలాన్ని పరిశీలిస్తున్న క్రమంలో అనంతపురంలో ఎయిర్ బస్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రదేశాన్ని ఎంపిక చేసిన తర్వాత ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది ఆఖరిలో భూమి పూజ నిర్వహించనున్నట్టు చెప్తున్నారు. 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్ బస్ లక్ష్యంగా పెట్టుకుందని కూడా చెబుతున్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో చర్చలు
అయితే ఈ హెలికాప్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఎందుకంటే 2015- 2016 మధ్యకాలంలో ఈ ఎయిర్ బస్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర ఏర్పాటు చేయాలని ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. అప్పట్లోనే ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం భూమిని కేటాయించడానికి సిద్ధమైనప్పటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
ఎయిర్ బస్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు
మళ్లీ ఇప్పుడు ఎయిర్ బస్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం రెడీ అయినట్టు వస్తున్న వార్తలతో ఏపీ ప్రభుత్వం ఈ ప్లాంట్ ను ఏపీ లోనే పెట్టించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. గతంలోనే ఏపీతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఎయిర్ బస్ కూడా ఏపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications