Google: వైజాగ్, అనకాపల్లి డేటా సెంటర్లపై మరో కీలక నిర్ణయం-సర్కార్ ఉత్తర్వులు..!
ఏపీలో భారీ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్దమైన గూగుల్ (google)కు పూర్తిగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. గూగుల్ కు చెందిన రైడెన్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. తాజాగా దీని విస్తరణ ప్రతిపాదనలకు సైతం ఆమోద ముద్ర వేసింది. దీంతో విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాల్లో సైతం ఈ డేటా సెంటర్లు మూడు చోట్ల తమ కార్యకలాపాలు చేపట్టేందుకు అవకాశం లభించింది.
గూగుల్ కు చెందిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ గతంలో విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాల్లో మూడు చోట్ల డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని 601.40 ఎకరాలకు పెంచాలంటూ తాజాగా గూగుల్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజా ప్రతిపాదన ప్రకారం గతంలో రాంబిల్లి దగ్గర ఇచ్చిన 160 ఎకరాల స్ధానంలో 174.80 ఎకరాలు కేటాయించనున్నారు.

అలాగే తర్లువాడ దగ్గర గతంలో అనుమతించిన 200 ఎకరాలు కేటాయించగా.. దీన్ని 266.60 ఎకరాలకు పెంచుతారు. అడవివరం, ముదసర్లోవ దగ్గర గతంలో 120 ఎకరాలు ఇవ్వగా.. తాజాగా దాన్ని 160 ఎకరాలకు పెంచుతున్నారు. ఈ మొత్తం భూముల్ని అదానీ ఇన్ ఫ్రా పేరుతో కేటాయించాలని గూగుల్ అనుబంధ రైడెన్ ఇన్ఫోటెక్ చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ప్రతిపాదనల ఆమోదం తర్వాత విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం మూడు డేటా సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. అడవివరం, ముదసర్లోవలో వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్, తర్లువాడలో వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్, రాంబిల్లిలో వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ పేరుతో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తారు. వీటి డీపీఆర్ లు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా.. వాటిని తదుపరి చర్యల కోసం ఏపీఐఐసీకి పంపింది. త్వరలోనే ఈ మూడు డేటా సెంటర్లు కార్యరూపం దాల్చబోతున్నాయి.












Click it and Unblock the Notifications