కాల్ మనీపై గవర్నర్ స్పందన: కాల్ మనీలో 'సెక్స్ రాకెట్' షాకింగ్!
గుంటూరు: బెజవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారం, అంతకుముందు సంచలనం సృష్టించిన కల్తీ మద్యం పైన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆదివారం నాడు స్పందించారు. ఆయన గుంటూరు జిల్లా యల్లమందలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డంపింగ్ యార్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారులతో ముఖాముఖిలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బయట వ్యక్తుల నుంచి ఎవ్వరూ రుణాలు తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సంస్థల నుంచే అందరూ రుణాలు తీసుకోవాలని హితవు పలికారు.
మద్యానికి అందరు కూడా దూరంగా ఉండాలని సూచించారు. స్వచ్ఛ భారత్ విషయమై మాట్లాడుతూ... వ్యక్తిగత మరుగుదొడ్లను అందరూ వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

కాల్ మనీపై నిలదీస్తాం: వైసిపి
కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశంపై తమ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని వైసిపి నేత పార్థసారథి చెప్పారు. కాల్ మనీతో సంబంధమున్న వారిని ప్రభుత్వ పెద్దలు తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
ప్రభుత్వం ముందుగానే మేల్కొంటే ఇలాంటివి జరిగేవి కావన్నారు. నిష్పక్షపాత దర్యాఫ్తు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు హామీల వల్లే బ్యాంకులు మహిళలకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో ప్రజలు గత్యంతరం లేక కాల్ మనీ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారన్నారు.
సిబిఐతో దర్యాఫ్తు చేయించాలి: రాఘవులు
కాల్ మనీ వ్యవహారాన్ని సిబిఐతో దర్యాఫ్తు జరిపించాలని సిపిఎం నేత రాఘవులు ఆదివారం నాడు డిమాండ్ చేశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు.
కాల్ మనీలో మరో షాకింగ్!
కాల్ మనీ వ్యవహారంలో బాధితులు పోలీసు స్టేషన్ల ముందు వరుస కడుతున్నారు. మోహన్ అనే నాయకుడి వద్ద తాను రూ.50 వేలు తీసుకుని ఇప్పటికే రూ.2 లక్షలు కట్టానని మహిళా బాధితురాలు తన గోడును మీడియా ఎదుట వెళ్లబోసుకున్నారు.
ఏడాదిన్నరగా నెలకు రూ.10 వేల చొప్పున కడుతున్నానని, అయినా అప్పు తీరలేదని చెబుతూ తన ఇంటి కాగితాలు తీసుకుపోయారని, వాటి గురించి అడిగితే, వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆ మహిళ వాపోయారు.
తాను చెప్పిన చోటుకు వస్తుంటే.. రోజుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ సంపాదించవచ్చని, ఆ డబ్బు తనకు జమ కట్టాలని మోహన్ తనను వేధించాడని ఆమె పేర్కొన్నారు. డబ్బు ఇవ్వకుంటే కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతానని బెదిరించాడని తెలిపారు. ఫిర్యాదు చేస్తే ఫలితం లేదని వాపోయారు.












Click it and Unblock the Notifications