ఇక చాలు, ఆపండి - గ్రామ సచివాలయాలకు ప్రభుత్వ ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ప్రభుత్వం నుంచి జారీ అవుతున్న సర్టిఫికెట్ల పైన మాజీ సీఎం జగన్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాల పైన నవరత్నాల లోగోలు ఉండటం పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో, ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రభుత్వ తాజా ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం తాజాగా వార్డు, గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు పూర్తయినా ఇంకా ప్రభుత్వ రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలు కనిపిస్తున్నాయి. వీటిని తొలిగించాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ఇప్పటికీ సచివాయాలు...మీ సేవా కేంద్రాల ద్వారా గత ప్రభుత్వంలో నిర్ణయించిన నమూనాలోనే సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. సర్టిఫికెట్లు, పట్టాల పైన నాడు జగన్ బొమ్మల అంశం పైన కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.

సర్టిఫికెట్ల జారీలో
తమ ప్రభుత్వం వస్తే పాస్‌పుస్తకాలు, ప్రభుత్వ రికార్డులు, సర్టిఫికెట్లపై ఉన్న జగన్ బొమ్మలు తొలగిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలు, విద్యార్థులకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలపై జగన్ ఫొటోలు తొలగించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చి ఉంటే వాటి ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఇది జరిగి మూడు నెలలవుతోంది.
వెనక్కు తీసుకోండి
అయినా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇచ్చే రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలు, సర్టిఫికెట్లపై ఇంకా జగన్ బొమ్మలే కనిపిస్తున్నాయి. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంలో నిర్ణయం తీసుకుంది. వార్డు, గ్రామ సచివాలయాలతో పాటుగా మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లు.. ఇతర ప్రభుత్వ పత్రాల పైన ఏ రాజకీయ నేత..పథకాల లోగోలు లేకుండా జారీ చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేసి ఉంటే వాటిని వెనక్కు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక నుంచి ఎవరైనా గతంలో లాగానే నేతల ఫొటోలతో సర్టిఫికెట్లు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ రకమైన పత్రాలను సచివాలయాల నుంచి నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications