ఏపీ.. ఊపిరిసలపనివ్వని స్థితి
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మే నాటికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తోన్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. వేడి గాలుల ప్రభావానికి శరీరంలో నీటి శాతం కూడా ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత ఊపిరిసలపనివ్వట్లేదు.

మే ముగిసేంత వరకు ఎండ తీవ్రత 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ ఆదివారం నాడు కర్నూలు జిల్లా నగరడోనలో 44.8 డిగ్రీల ఎండ కాచింది. రాష్ట్రంలోకెల్లా ఇదే అత్యధికం. కడప పట్టణంలో44.2 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రెండో అత్యధికం. అలాగే 18 జిల్లాల్లో 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. అవేకాకుండా విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది.












Click it and Unblock the Notifications