300 కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో... ప్రతి ఇంట్లో మేనరికపు పెళ్లిళ్లే..
మనదేశ సంస్కృతిలో వివాహవ్యవస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. సొంతవారు, పరాయివారు అంటూ లెక్కలు వేస్తూ పిల్లల భవిష్యత్తు నాశనమవతుందని తెలిసినా పెద్దలు మూర్ఖంగా ముందుకు వెళుతున్నారు. అలాంటి నిర్ణయాలకు కారణాలు ఏవైనా.. కారకులు ఎవరైనా..బలవుతున్నది మాత్రం అమ్మాయిలే. తమ కుటుంబంలోనే ఉండాలంటూ.. తమ వాళ్లే కావాలంటూ.. ఆస్తిపాస్తులూ పోకూడదంటూ నేటికి మేనరికపూ పెళ్లిళ్లకే మొగ్గుచూపుతున్నారు చాలామంది. అయితే ఒక మేనరికపు పెళ్లిలో ఎన్నో సమస్యలుంటాయి. కానీ, ఈ గ్రామంలో మాత్రం అన్నీ మేనరికపు పెళ్లిళ్లే.. ప్రతి ఇంటికో గాథ.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదండి.
తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం : ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా పాంచాలి గ్రామంలో ప్రతి ఇంట్లో మేనరిక పెళ్లిళ్లే.. ఇదే అక్కడి సంప్రదాయమట. అక్కడ ఏ వివాహం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా అన్నీ ఆ గ్రామస్థుల వారితోనే, బయటి వారితో అస్సలు జరగవు. ఆ గ్రామంలో ఎవరైనా సరే తమ ఆడపిల్లను ముందుగా తన మేనమామ లేదా మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒకేవేళ సొంతవారు లేకపోతే మరొక సమీప బంధువుతో మేనరిక వివాహాలు జరుగుతాయి. ఈ మేనరికపు వివాహాలు ఇప్పటివీ కాదు. ఎన్నో తరాల నుంచి ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతున్నాయి. మేనరికం చేస్తే ఇంటి ఆడపిల్లలు పెద్దలకు చేదోడువాదోడుగా ఉంటారని ఇక్కడి వారి నమ్మకం. ఈ పెళ్లిళ్ల వల్ల కుటుంబాలు అన్నీకలిసి ఉంటాయి. కష్టసుఖాల్లో కుటుంబాలన్ని అండగా ఉంటాయనేది ఇక్కడివారి ఉద్దేశ్యం..

ప్రతి జంటలో దాగి వున్న కన్నీటి బాధలు : చూసేవారికి ఈ మేనరికపు పెళ్లిళ్లు సంతోషంగా ఉన్నా, ఇక్కడి జంటల్లో మాత్రం ఎదో తెలియని బాధ కనిపిస్తుంది. ఎవరికీ చెప్పుకోలేని నరకం వారిని నిత్యం వేధిస్తూనే ఉంది. మూడు వందల కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో మేనరికపు పెళ్లిళ్లే. ఇక్కడ కనిపిస్తున్నా ప్రతి జంట పైకి ఆనందంగా కనిపిస్తున్నా లోలోన వారి కన్నీటి భాధలు మాత్రం ఎవరికీ అగుపించవు. అందుకు కారణం వారికి పుట్టిన బిడ్డలే.. ఇక్కడి పిల్లలు ఏదో ఒక రుగ్మతతో పుడుతున్నారు. దానికి కారణం మేనరికపు పెళ్లిళే.. ఈ పెళ్ళిళ్లు చేసుకున్న దంపతుల పిల్లలో కొందరికి బుద్ది మందగిస్తే, మరికొందరికి ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మరికొందరేమో గుండెజబ్బులు, కంటి చూపు లోపం, వినికిడి సమస్య వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అంతేకాదు, పుట్టిన బిడ్డ మరణించడం లేదా కడుపులో ఉండగానే బిడ్డ చనిపోవడం వంటివి జరుగుతున్నాయి.
మేనరికపు పెళ్లిళ్లు వద్దొంటున్న వైద్యులు : పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకొని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం మేనరిక పెళ్లిళ్ల ఆనందం వెనుక కన్నీటి వ్యధలు దాగి ఉన్నాయి. ఇలాంటి సమస్యలు వస్తాయని తెలిసి కూడా ఈ గ్రామస్థులు మేనరికపు పెళ్లిల్లే చేసుకుంటున్నారు.. చేస్తున్నారు.. వారికి పుట్టిన పిల్లలను చూసి ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర మానసిక వేదనతో అనునిత్యం కాలం గడుపుతున్నారు ఈ గ్రామంలోని జంటలు. మేనరికపు పెళ్ళిళ్లు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దని ఒకపక్క వైద్యులు సూచిస్తున్నా.. వీరు మాత్రం ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఈ పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు. జనటిక్ సమస్యల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications