కాపునేత వంగవీటి రంగా విగ్రహానికి ఘోర అవమానం.. చంద్రబాబు సీరియస్, కీలక ఆదేశం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఒక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాపు నేత వంగవీటి రంగా విగ్రహానికి కైకలూరులో ఘోర అవమానం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వంగవీటి రంగా విగ్రహానికి పేడ పూసి అవమానించారు. గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో వంగవీటి రంగా విగ్రహాలకు పేడ పూయడం ఏపీలో కలకలం రేపింది.
వంగవీటి రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగులు
కలిదిండి మండలంలోని కలిదిండి ఆ పక్కనే ఉన్న మరొక గ్రామమైన రుద్రవరంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాలకు దుండగులు పేడ పూశారు. ఇక ఈ ఘటనతో వంగవీటి రంగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పైన స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి లోని వంగవీటి రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు .

వంగవీటి రంగా విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్
అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇక మరోవైపు వంగవీటి మోహనరంగా విగ్రహానికి జరిగిన అవమానం నేపథ్యంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వంగవీటి రంగా విగ్రహాన్ని శుద్ధి చేశారు. వంగవీటి రంగా విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు.
కావాలనే ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే కుట్ర
కావాలని సమాజంలో అల్లర్లు రేపడానికి, ఒక సామాజిక వర్గాన్ని ఉసిగొల్పడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనలకు కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇద్దరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
సీఎం చంద్రబాబు సీరియస్ ..రంగంలోకి పోలీసులు
అర్ధరాత్రి ఒంటిగంట అయిదు నిమిషాల ప్రాంతంలో వంగవీటి రంగా విగ్రహానికి పేడ పూసినట్టు గుర్తించి ఘటనకు పాల్పడిన వారికోసం గాలిస్తున్నారు. దీని వెనక ఎవరి ప్రమేయం ఉంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ కావటంతో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వటంతో పోలీసులు నిందితుల వేటలో ఉన్నారు.












Click it and Unblock the Notifications