విజయవంతం: నిప్పులు చిమ్ముతూ.. నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05
అమరావతి: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన రాకెట్ 17 నిమిషాల్లోనే కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 250కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ ఉపగ్రహం బరువు 2,211కిలోలు. ఇంధనం 1,255 కిలోలు.
ఈ ప్రయోగం కౌంట్‌డౌన్ బుధవారం ఉదయం 11.10 గంటలకు ప్రారంభమై... గురువారం సాయంత్రం 4.10 గంటలకు ముగిసింది. అయితే చివరి నిమిషంలో క్రయోజనిక్ ఇంజిన్‌లో నీటి లీకేజీని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదా వేసి మరమ్మతులు చేపట్టారు. అనంతరం 40 నిమిషాల ఆలస్యంగా 4.50 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగం ప్రారంభమైన 45 సెకన్ల తర్వాత తొలిదశ విజయవంతం కాగా, ఆపై బూస్టర్ ఇంజన్ల సాయంతో జీఎస్ఎల్వీ- ఎఫ్ 05 దూసుకెళ్లింది. 135 సెకన్లకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రాకెట్ లో ఆపై మూడోదశ ఇంజన్ విజయవంతంగా ఆన్ కావడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనులు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీ ఇస్రోకు అభినందనలు తెలిపారు.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం:
అంతక ముందు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ నుంచి గురువారం సాయంత్రం 4.10 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.

మూడోదశలోని క్రయోజనిక్ ఇంజిన్‌లో ఏర్పడ్డ సాంకేతికలోపం వల్ల సేఫ్టీ రిలీవ్ వాల్వ్ తెరచుకోకపోవడంతో 40 నిమిషాలుగా కౌంట్ డౌన్ నిలిచిపోయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగాన్ని 40 నిమిషాల పాటు వాయిదా వేశారు. బైపాస్ సిస్టం ద్వారా ఇంధనాన్ని నింపారు. తిరిగి 4.50 గంటలకు రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించారు.
గురువారం సాయంత్రం 4.10 గంటలకు జీఎస్ఎల్వీఎఫ్-05ను ప్రయోగించేందుకు బుధవారం ఉదయం 11.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా వాతావరణ అధ్యయనం చేయవచ్చు. ఇందులోని 6-ఛానల్ ఇమేజర్ ద్వారా భూమిపైన, సముద్రాలపైన జరిగే మార్పుల ఛాయా చిత్రాలను తీయవచ్చు.

ఇది పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఆధునిక ఉపగ్రహం. ఇన్సాట్-3డీఆర్‌లో మెరుగైన ఇమేజింగ్ వ్యవస్థ, వాతావరణంలోని శబ్ద తరంగాలను అన్వేషించే వ్యవస్థ ఉంది. దీని జీవిత కాలం పదేళ్లు. ఇదిలా ఉంటే ఇదే తరహా రాకెట్ ప్రయోగాలను గతంలో జనవరి 2014, ఆగస్టు 2015లో విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది.












Click it and Unblock the Notifications