Chandrayaan 3: నిప్పులు చిమ్ముతు జాబిల్లి వైపు..
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్‌ను నింగిలోకి పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది ఈ రాకెట్. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. చందమామ దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ అవుతుంది.
2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లనూ చేసింది. వారి అంచనాలకు అనుగుణంగా ప్రారంభం దశలో రాకెట్ ప్రయాణం.. సవ్యంగా సాగింది. దశలవారీగా అన్ని రాకెట్ నుంచి విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో ఇది చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు సాగించడానికి ఇస్రో దీన్ని ప్రయోగించింది. ఉపరితల వాతావరణం, చంద్రశిలలు, మట్టి నమూనాలను సేకరిస్తుంది.
చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పోక్ట్రోస్కోపీ.. వంటివి ఈ రాకెట్ పేలోడ్స్.
గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది. చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది.
చంద్రుడి ఉపరితలానికి సమీపించిన తరువాత ఇస్రో దాని వేగాన్ని నియంత్రించలేకపోయింది. ఫలితంగా శరవేగంతో అది ఉపరితలాన్ని ఢీకొట్టి.. ముక్కలైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో- ఈ ప్రయోగం విఫలమైనట్లు అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. లాంచింగ్ వెహికల్ కోసం క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని వినియోగించారు. ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్‌కు సంబంధించిన ఎలక్ట్రో మేగ్నటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ఎలక్ట్రో మేగ్నటిక్ కాంపాటిబిలిటీ, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, ఆటో కాంపాబిలిటీ టెస్ట్, యాంటెన్నా పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్.. అన్ని సవ్యంగా పని చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications