జగన్ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగం, తానిచ్చింది ఐటీ ఉద్యోగం: తేడా చెప్పిన చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని డోన్ సభలో మాట్లాడిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించిన ఆయన, ఈ ఎన్నికలు విధ్వంసకర పాలనకు అభివృద్ధికి మధ్య సవాల్ అంటూ పేర్కొన్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటమని స్పష్టం చేశారు. వైసిపి కి కాలం చెల్లిందని, వారి డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగం.. తాను ఇచ్చింది ఐటీ ఉద్యోగం
జగన్ గాలి మనిషని, గాలి పైన కూడా టాక్స్ వేస్తారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ కు తనకు ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పిన చంద్రబాబు జగన్ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగమని తాను ఇచ్చింది ఐటీ ఉద్యోగం అని గుర్తు చేశారు. జాబు రావాలంటే బాబు రావాలని పేర్కొన్న చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగాలకు గ్యారెంటీ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

పట్టాదారు పాసు పుస్తకాలపైన జగన్ ఫోటో దేనికి?
తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ పైన తొలి సంతకం చేస్తామంటూ చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని, బీసీలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చంద్రబాబు అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్ల పైన కూడా జగన్ ఫోటో ఎందుకు పెట్టారు అని ప్రశ్నించిన ఆయన జగన్ తాత రాజారెడ్డి ప్రజలకు ఏమైనా ఆస్తులు ఇచ్చాడా అంటూ నిలదీశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు
ప్రజల ఆస్తులను జగన్ పేరుతో రాసుకుంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు . భూములు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రయత్నం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు. భూముల వివరాలన్నీ దస్తావేజులు లేకుండా ఆన్ లైన్ చేసే ఆలోచన వెనుక దురుద్దేశం ఉందన్నారు.
జగన్ పై జనాల్లో విశ్వసనీయత లేదు
జగన్ పై జనాల్లో విశ్వసనీయత లేదని, తన విశ్వవసనీయత ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన తెలుస్తుందన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, చంద్రబాబు జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, కరెంటు చార్జీలు 9సార్లు పెంచారని, మద్యం ధరలు పెంచారని, చెత్త మీద కూడా పన్ను వేశారని చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications