హాకీ రజనీపై జగన్ సర్కార్ వరాల జల్లు-రూ.25 లక్షలు, ఉద్యోగం, పాత బకాయిలూ
టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఏపీ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి సీఎం జగన్ ఇవాళ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను ఇవాళ ఆమె కుటుంబసభ్యులతో వచ్చి కలిశారు. ఈ సందర్భంగా రజనిని అభినందించిన సీఎం జగన్.. ప్రోత్సహకాలు ప్రకటించారు.
భారత మహిళా హాకీ జట్టు తరఫున సత్తా చాటిన రజినీకి రూ. 25లక్షల నగదుతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరు దాకా దూసుకెళ్లిన మహిళా జట్టులో రజినీ కీలక పాత్ర పోషించారు. దీంతో రజనీ ప్రదర్శనను సీఎం జగన్ ప్రశంసించారు. ఆమెను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రజనీకి తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంకి చెందిన రజనీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్ 2020లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి ఆమె. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో పాల్గొని ప్రతిభ చూపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ, శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.ప్రభాకర్ రెడ్డి, పలువురు శాప్ అధికారులు పాల్గొన్నారు.

రజనీకి గత ప్రభుత్వం ప్రకటించిన రూ.62.5 లక్షల ప్రోత్సహకాన్ని రేపు ఉదయం కల్లా అందిస్తామని ఈ సందర్భంగాై క్రీడల మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రజనీ కుటుంబంలో మరో వ్యక్తికి తొలుత ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత పర్మినెంట్ చేస్తామని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం రజనీకి అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి అవంతి పేర్కొన్నారు.
హాకీ రజనీపై జగన్ సర్కార్ వరాల జల్లు-రూ.25 లక్షలు, ఉద్యోగం, పాత బకాయిలూ#andhrapradesh, #tokyoolympics, #women #hockey, #rajini, #ysjagan pic.twitter.com/0ysuYgSogh
— oneindiatelugu (@oneindiatelugu) August 11, 2021












Click it and Unblock the Notifications