సినిమాల్లో వారసత్వం లేదా?...మరి ఇక్కడ ఎందుకు ఉండకూడదు:పవన్ పై జలీల్‌ఖాన్ సెటైర్లు
విజయవాడ:జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మండిపడ్డారు. సినిమాల్లో అవకాశాలు లేక జనంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. వారసత్వం గురించి మట్లాడుతున్న పవన్ కళ్యాణ్ తన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని....సినిమాల్లో వారసత్వం లేదా?...అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. మరి సినిమాల్లో వారసత్వం ఉన్నప్పుడు.. రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదు?...అని ప్రశ్నించారు.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌పై కవాతు...సభ పేరుతో పిచ్చి ప్రేలాపనలు చేశాడని జలీల్ ఖాన్ మండిపడ్డారు. రాజకీయ కుటుంబంలో వారసుడు రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదని జలీల్‌ఖాన్ ప్రశ్నించారు. మరి పవన్, అతని కుటుంబసభ్యులు సినీ హీరోలు ఎలా అయ్యారని ఆయన ధ్వజమెత్తారు. పేదపార్టీ అని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు...ఆకాశం నుంచి పూలు చల్లించుకునేందుకు ఖర్చులు ఎక్కడివని జలీల్ ఖాన్ నిలదీశారు.
కష్టాలకు ఎదురీదుతూ రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని...నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు గురైతే పవన్ కు పరామర్శించడానికి ఇంతవరకు తీరిక లేదని,దీన్ని బట్టే ఆయనకు గిరిజనులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు.
రాజకీయాల్లో హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని పవన్ కు జలీల్ ఖాన్ హితవు పలికారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో పవన్‌కు ఒక్క సీటూ రాదన్నారు. బిజెపి రాసిచ్చిన స్క్రిప్ట్‌లను పవన్ ఇక్కడకొచ్చి చదువుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో వైసిపి అధ్యక్షుడు జగన్‌కు సానుభూతి వల్ల 67 సీట్లు వచ్చాయని, ఈసారి 30 సీట్లు కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. ప్రజాసమస్యల కంటే ప్రభుత్వంపై విమర్శలకే జగన్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని జలీల్‌ఖాన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications