YS జగన్ బలం, బలగాలపై పవన్ కల్యాణ్ కన్ను?
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని, పొత్తులకు కూడా సిద్ధమేనని జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలోనే ప్రకటించారు. విశాఖపట్నంలో జనవాణిని నిర్వహించేందుకు వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ ను పోలీసులు అక్కడినుంచి పంపించివేయడంతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ అగ్రహోదగ్రులయ్యారు. ఈ పరిణామాల తర్వాత రాష్ట్రంలో వైసీపీ, జనసేన శ్రేణుల మధ్య యుద్ధవాతావరణం నెలకొందంటే అతిశయోక్తి కాదు.

మారిపోయిన పవన్ కల్యాన్ వ్యూహాలు
ఆ తర్వాత నుంచి పవన్ కల్యాణ్ వ్యూహాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీతో పొత్తు గురించి కొన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్నప్పటికీ విశాఖ తర్వాత అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రెండు పార్టీల శ్రేణులు ఉమ్మడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. పవన్ పార్టీలోని సీనియర్ నేతలతో అంతర్గతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలపై తాజాగా సమావేశం నిర్వహించారు.

వైసీపీ ఓట్లు చీల్చాలంటే ఏం చేయాలి?
గత ఎన్నికల్లో వైసీపీ ఎక్కడెక్కడ గెలిచింది? ఆ స్థానాల్లో ఇప్పుడు పరిస్థితి ఏమిటి, వైసీపీ ఓటుబ్యాంకు ఎవరు? జగన్ కు బలోపేతంగా మారుతున్న అంశాలేంటి? జనసేన అక్కడ ఎంతవరకు ప్రభావితం చేయగలదు? వైసీపీ ఓటు బ్యాంకును చీలిస్తే ఎవరికి లాభం కలుగుతుంది? ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎంత ఉండబోతోంది? అభిమానులందరినీ ఓటుబ్యాంకుగా మార్చుకోవడానికి ఏం చేయాలి? ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు పోలయ్యే ఓట్లలో టీడీపీ నుంచి వస్తాయా? వైసీపీ నుంచి వస్తాయా? వైసీపీ ఓట్లు భారీగా చీల్చాలంటే ఏం చేయాలి.. తదితర అంశాలపై నేతలతో పవన్ చర్చించారు. ఈ ఐదు ఉమ్మడి జిల్లాల్లో రాజకీయం దూకుడుగా చేయాలని నిర్ణయించారు.

టీడీపీ ఓటు చీలకూడదు!
2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జగన్ కు ఎక్కువగా లాభించిందనేది పవన్ కల్యాణ్ అభిప్రాయంగా ఉంది. టీడీపీ ఓటుబ్యాంకు చీలకుండా, వైసీపీ ఓటుబ్యాంకు చీలేలా ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలి? అనే అంశంపై జనసేన నేతలు దృష్టిపెట్టారు. టీడీపీతో కలిసి పోటీచేయడంద్వారా తన అభిమానులు, పార్టీ శ్రేణుల బలాన్ని టీడీపీవైపు మళ్లించవచ్చని, అలాగే జనసేన పోటీచేసే నియోజకవర్గాల్లో టీడీపీ బలాన్ని పార్టీవైపు మళ్లించుకునేలా చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్న పవన్ అందులో సఫలీకృతులవుతారా? లేదా? అనే విషయం తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications