విశాఖలో కూటమికి షాక్..! వైసీపీ మేయర్ అభ్యర్ధికి జనసేన నేత మద్దతు..!
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కూటమిలో భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీకి కూటమి ధర్మం ప్రకారం 30 శాతం సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారంటూ ఇప్పటికే మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. పలు చోట్ల రెబెల్స్ గా బరిలోకి దిగుతున్నారు. అయితే విశాఖలో ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కూటమి మేయర్ అభ్యర్ధిని కాదని, వైసీపీ నిలబెట్టిన మేయర్ అభ్యర్ధికి జనసేన సీనియర్ నేత ఒకరు మద్దతు ప్రకటించి సంచలనం రేపారు.
విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ గా కూటమి తరఫున టీడీపీ నేత ముక్కా శ్రావణికి టికెట్ ఇచ్చారు. ఆమెను కూటమి పార్టీలన్నీ కలిసి గెలిపించాలని చంద్రబాబు టార్గెట్ కూడా ఇచ్చారు. అయితే నగరంలోని కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ సీట్ల పంపకాల్లో మాత్రం జనసేనకు పలు చోట్ల మొండి చేయి చూపారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) ఇవాళ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు.

పొత్తు ధర్మాన్ని పాటించిన ప్రతిచోటా కూటమి నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం మనమంతా నిబద్ధతతో కృషి చేద్దామని జనసేన కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడైతే జనసేన పార్టీకి 30% వాటా దక్కలేదో, అక్కడ ఆ మేరకు జనసైనికులు, వీర మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. విశాఖపట్నం విషయంలో తన వైఖరి ప్రత్యేకమని తెలిపారు. విశాఖ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, సింహాచలం కొండలను కాపాడతాను, సహజ వనరులను రక్షిస్తాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కృషి చేస్తానని బహిరంగంగా ప్రకటించిన మహిళా కార్పొరేటర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారికి తన మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

ఆమె వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ, పార్టీలకు అతీతంగా ప్రాంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం తన బాధ్యతగా భావిస్తున్నానని బొలిశెట్టి తెలిపారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే, విశాఖ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేనన్నారు. విశాఖ పర్యావరణం, సింహాచలం కొండలు, సహజ వనరులు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఆమె చేసిన హామీలను పరిగణనలోకి తీసుకుని, విశాఖ మేయర్ ఎంపికపై ప్రాంత ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని వినమ్రంగా కోరుతున్నట్లు బొలిశెట్టి పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
