చాపకింద నీరులా.. వ్యూహం ప్రకారం శరవేగంగా విస్తరిస్తోన్న జనసేన!
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ రాజకీయాలను బాగా వంటపట్టించుకుంటున్నారు. ప్రారంభంలో కాస్తంత తడబడినప్పటికీ నెమ్మది నెమ్మదిగా తనలోని అస్త్రశస్త్రాలను బయటకు తీస్తున్నారు. వైసీపీ, టీడీపీలకు ధీటుగా జనసేనను సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను జనసేన ప్రభావం ఉండాలని, జనసేన లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అవకూడదనే లక్ష్యంతో ఆయన కొనసాగుతున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా..
ఎన్నికల సమయంలోనే సహజంగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో సీట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు నిరాకరించిన ఎమ్మెల్యేలుకానీ, బలమైన అభ్యర్థులుకానీ ఇతర పార్టీలవైపు దృష్టిసారిస్తారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని భావిస్తున్న పార్టీలన్నీ అందుకనుగుణంగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలకన్నా జనసేన ముందంజలో ఉందని చెప్పవచ్చు.

జనసేనానితో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు.. సీట్ల కోసమేనా?
ఇప్పటికే కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జనసేనానితో టచ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. తన సొంత ఆదాయం నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇస్తుండటం పవన్‌కు మంచి పేరు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు పలు యాత్రలు చేసిన నేతలెవరూ ఈ స్థాయిలో తమ సొంత సొమ్మును ఖర్చుపెట్టలేదు. అంతేకాకుండా తన నిబద్దత ఏమిటి? తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను? అనే విషయాలకు సంబంధించి ఇంటర్నెట్ లో వీడియోలుంటాయని, అవి చూసి నమ్మకం ఉంటేనే ఓటువేయాలని పవన్ కోరుతున్నారు. 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చిన తాను మధ్యలో పారిపోయే ప్రసక్తే లేదని, అభివృద్ధి, సంక్షేమం జనసేన పార్టీకి రెండు కళ్లలాంటివని స్పష్టం చేస్తున్నారు.

వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్న పవన్
సినిమాల పరంగా, సామాజికవర్గం పరంగా తన ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు, గత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన నియోజకవర్గాలను పార్టీ గుర్తించింది. బీజేపీతో, టీడీపీతో పొత్తున్నా లేకపోయినా తన పంథాలో తాను వెళ్లాలని ఆ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకుంది. అందుకే ఎక్కడా తన ప్రసంగాల్లో పొత్తు అనే ప్రసక్తే లేకుండా పవన్ మాట్లాడుతున్నారు. ఎవరు కలిసివచ్చినా రాకపోయినా కులం, మతం లేకుండా కేవలం మనిషి, మానవత్వం అనే కోణంలో ఆలోచించి జనసేనను ఆదరించాలని కోరుతున్నారు. ప్రజల మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్న జనసేనాని కోరిక ఎంతవరకు నెరవేరుతుందో తెలుసుకోవాలంటే కాస్తం సమయం పట్టే అవకాశం కనపడుతోంది.!!












Click it and Unblock the Notifications