జాతి తల్లడిల్లుతోంది: జెపి, 24న సమైక్య జెఏసి బంద్
హైదరాబాద్/వరంగల్: ఇవాళ తెలుగు జాతి సంక్షోభంతో తల్లడిల్లిపోతోందని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంటనే ప్రభుత్వం శాసన సభను సమావేశపర్చి, చట్ట సభల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలన్నారు. సంక్షోభంపై సమగ్రంగా చర్చించాలన్నారు. సంక్షోభానికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత చట్టసభలకు ఉందన్నారు.
రాగద్వేషాలకు అతీతంగా అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం చూపాలన్నారు. విభజనను కేంద్రం రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం కావాలన్నారు. జాతి సమగ్రతను కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలాగే ఉంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అందరు సామరస్యత నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు.

భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన సమైక్యాంధ్ర జెఏసి
సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 18, 20వ తేదీల్లో కేంద్ర కార్యాలయాల ముట్టడి, 21న సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు విద్యుత్ నిలిపివేత, 23 - 30 వరకు సీమాంధ్రలో ప్రయివేటు విద్యాసంస్థల బంద్, 25, 26న ప్రయివేటు ట్రావెల్స్ బంద్ ప్రకటించారు. ఈ నెల 24వ తేదిన రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.
బాబుతో లేఖ రాయించాలి: కడియం
తెలుగుదేశం పార్టీ హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు అనుకూలంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ నేతలు వారి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేఖ ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సంబరాలు పక్కన పెట్టి పార్లమెంటులో బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
విజయమ్మ రైతు శంఖారావం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో కృష్ణా, గోదావరి డెల్టా రైతుల సమస్యలపై త్వరలో రైతు శంఖారావం నిర్వహిస్తామని, వేలాదిగా ట్రాక్టర్ల ప్రదర్శన ఉంటుందని ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications