జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజ్... ఇక్కడ ఏం రిపేర్ చేస్తారో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్... ఈ పేరులోనే నటన ఉంది. నవరసాలను సులువుగా పోషించి దర్శకులకు కావల్సినరీతిలో ఔట్ ఫుట్ ఇచ్చే అరుదైన నటుల్లో ఆయన ఒకరు. తన కెరీర్ లో రాజమౌళి దర్శకత్వంలో చేసిన స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత సింహాద్రి, ఆది లాంటి బ్లాక్ బస్టర్లు చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అనే నటుడు సూపర్ హిట్ సినిమాలు తీసే డైరెక్టర్లకు ప్రయోగశాలే కాదు.. ఫ్లాప్ డైరెక్టర్లను ఆపదలో ఆదుకొని వరాలిచ్చే దేవుడు. ఒకప్పుడు తారక్ కూడా హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ల వెంట పరుగులు తీసేవాడు. కాకపోతే అవన్నీ డిజాస్టర్లయ్యేవి. సింహాతో హిట్ ఇచ్చిన బోయపాటితో సినిమా చేస్తే దమ్ము ఫ్లాపైంది. కందిరీగ తో హిట్ అందుకున్న సంతోష్ తో రభస తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో రామయ్యా వస్తావయ్యా చేస్తే ప్రేక్షకులు వెనుతిరిగి చూడకుండా పారిపోయారు.

కొన్ని ఫ్లాప్ సినిమాలు ఎదురైన తర్వాత ఫ్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్లతో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. వరుస డిజాస్టర్లు ఇస్తున్న పూరీతో టెంపర్ సినిమా చేసి సూపర్ హిట్ ఇచ్చాడు. వన్ నేనొక్కడినే సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన సుకుమార్ తో నాన్నకు ప్రేమతో చేసి మరో సూపర్ హిట్ మూవీని పరిశ్రమకు అందించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫెయిలైన బాబీతో జై లవకుశ చేసి మరో హిట్ అందుకున్నాడు.
అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. తాజాగా ఆచార్య సినిమాతో ఫ్లాప్ రుచిచూసిన కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే అంచనాలున్నాయి. జనతా గ్యారేజ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అని.. అలాగే ఫ్లాప్ సినిమాలతో డీలా పడ్డ పెద్ద పెద్ద దర్శకులందరికీ ఆఫర్లు ఇస్తూ వారిని ఆదుకుంటూ సూపర్ హిట్లు ఇస్తూ వారి కెరీర్ ను నిలబెడుతున్నాడని తారక్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు.












Click it and Unblock the Notifications