Kakinada City Assembly Election 2024 Results LIVE: మూడోసారి.. ద్వారంపూడి?
కాకినాడ నగర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య హోరాహోరి పోరు నెలకొంది.
ఈ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూసే నియోజకవర్గాల్లో ఒకటి- కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానం. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ కూడా తన గెలుపును రిపీట్ చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2009లో కాంగ్రెస్, 2014లో తెలుగుదేశం, 2019లో వైసీపీ విజయం సాధించాయి.

పార్టీ వేరయినా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెండుసార్లు ఇక్కడ విజయఢంకా మోగించారు. ఇంకోసారి వనమాడి వెంకటేశ్వరరావు ఘన విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ద్వారంపూడి.. 9,279 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీకి చెందిన బండాన హరిని మట్టికరిపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మూడోస్థానంలో నిలిచింది.
మొత్తంగా 1,19,664 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అప్పట్లో. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి 37.28 శాతంతో 44,606 ఓట్లు పోల్ అయ్యాయి. హరికి 21.42 శాతంతో 35,327, టీడీపీ తరఫున పోటీ చేసిన వనమాడి వెంకటేశ్వరరావుకు 21.42 శాతంతో 25,636 ఓట్లు పడ్డాయి.
2014 ఎన్నికల నాటికి రిజల్ట్ రివర్స్ అయింది. టీడీపీ అభ్యర్థి వనమాడి 24,000 ఓట్ల తేడాతో కాకినాడ సిటీలో పాగా వేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ద్వారంపూడి రెండోస్థానానికి పరిమితం అయ్యారు. మొత్తంగా 1,40,523 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వనమాడికి 54.42 శాతంతో 76.467 ఓట్లు పోల్ అయ్యాయి. ద్వారంపూడికి 52,467 ఓట్లు పడ్డాయి.
2019లో కాకినాడ సిటీ స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకుంది వైఎస్ఆర్సీపీ. టీడీపీ నుంచి పోటీ చేసిన వనమాడిపై 14,111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1,71,604 ఓట్లు పోల్ కాగా.. అందులో ద్వారంపూడికి 43.06 శాతం అంటే 73,890 ఓట్లు పోల్ అయ్యాయి. వనమాడి- 59,779, జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్- 30,188 ఓట్లు పడ్డాయి.
ఈ ఎన్నికల్లో మళ్లీ ద్వారంపూడి, వనమాడి పోటీ చేశారు. కాకినాడ సిటీ అసెంబ్లీ పరిధిలో 72.17 శాతం మేర పోలింగ్ నమోదైంది. దాదాపుగా ఓటర్లందరూ అర్బన్ ప్రాంతాలకు చెందినవారే. కాకినాడ అర్బన్ మండలం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 1 నుంచి 65 వార్డులు ఈ అసెంబ్లీ పరిధిలోకి వస్తాయి. అర్బన్‌లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ద్వారంపూడి ఎన్నికల అంత సులువు కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications