శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజల్లో కీలక మార్పులు - కొత్త టికెట్ ధరలు, ఇక నుంచి..!!
శ్రీకాళహస్తి భక్తులకు బిగ్ అప్డేట్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు, కేతు పూజల్లో కీలక మార్పులు చేసారు. ఈ మేరకు తాజా మార్పులకు ఆలయ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ పూజల్లో సామాన్య భక్తులతో పాటుగా స్థానికులకు ప్రాధాన్యత కల్పించారు. ఇప్పటి వరకు ఉన్న రూ 500 రాహు - కేతు పూజను రద్దు చేసి ప్రయోగాత్మకంగా రూ 100 కే టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదన చేసారు. ఈ పూజ కోసం తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తాజా నిర్ణయాలతో సామాన్య భక్తులకు ప్రయోజనకరంగా మారనుంది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు, కేతు పూజల్లో మార్పులు చేస్తూ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ 500 రాహు - కేతు పూజను రద్దు చేసి ఆ స్థానంలో ప్రయోగాత్మకంగా రూ 100 కే ఈ పూజ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రతి బుధవారం 2వేల మంది భక్తులను అనుమతించడంతో పాటు స్థానిక, తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. వెండి సర్పాలు లేకుండానే అందుబాటులో ఉన్న సామగ్రితోనే పూజ పూర్తి చేయిస్తారు. కాగా, ఇదే సమయంలో దక్షిణామూర్తి అభిషేకం టిక్కెట్టు ధర రూ.500గా నిర్ణయించారు. ప్రస్తుతం వెండి ధర పెరిగిన నేపథ్యంలో తాజాగా పూజలు, టిక్కెట్ల ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సామగ్రిలో వెండి సర్పాలు లేకుండానే పూజ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక రూ.750, రూ.1500, రూ.2500 పూజలు యథావిధిగా, ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగిస్తూ రూ.5 వేల పూజలను రూ.6 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మారిన టికెట్ ధరలు.. ఇక కొత్తగా
కాగా, రూ.500 అంతరాలయ దర్శన టికెట్ కొన్న భక్తులకు ఉచిత లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అదే విధంగా పూజా టిక్కెట్ల ధరల్లో మార్పు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల పైనా దృష్టి సారించారు. ఉత్సవాల సమయంలో స్వామి, అమ్మ వార్ల ఊరేగింపు సందర్భంగా వివిధ రకాల వాహన సేవ ఉంటుంది. ఈ వాహనాలు కొలువుదీరిన మండపాన్ని అభివృద్ధి చేయాలని కమిటీ నిర్ణయించింది. అదే విధంగా ఏర్పేడు మండలం కందాడ శివాలయం, కన్నలిలోని వీరభద్రస్వామి ఆలయాలను అనుబంధ ఆలయాలుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ఆలయానికి సంబంధించి పలు కొత్త నిర్ణయాలకు పాలక మండలి ఆమోద ముద్ర వేసింది.












Click it and Unblock the Notifications