మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాపై పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. 20 నుంచి 24 మంది శాసన సభ్యులు- శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం షెడ్యూల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తొలిదశలో వారిద్దరితో పాటు ఎనిమిది- డాక్టర్ జీ పరమేశ్వర, కే హెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వారికి శాఖలను ఇంకా కేటాయించలేదు. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తరువాత శాఖలన కేటాయిస్తామంటూ అప్పట్లోనే ప్రకటించారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాతో ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

గురుద్వారా రకబ్‌గంజ్ రోడ్‌లో గల పార్టీ కార్యాలయంలో సుమారు ఆరు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఎవరిని తీసుకోవాలనే విషయాలపై చర్చించారు. మొత్తంగా 28 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం తొలుత భావించినప్పటికీ- అది సాధ్యపడేలా లేదు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

గరిష్ఠంగా 34 మందిని కేబినెట్‌లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది కర్ణాటకలో. ఈ నేపథ్యంలో- ముందుగా నిర్దేశించుకున్న 28 మందికి అదనంగా మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మంత్రుల జాబితాపై మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో సిద్ధరామయ్య- డీకే శివకుమార్ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
అనంతరం సిద్ధరామయ్య- డీకే శివకుమార్.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను మర్యాపూరకంగా కలుసుకున్నారు. ఆ సమయంలో వారి వెంట ఎంబీ పాటిల్, జమీర్ అహ్మద్ ఖాన్, బైరాతి సురేష్ ఉన్నారు. ఇవ్వాళ వారంతా బెంగళూరుకు చేరుకోనున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టారు. మంత్రివర్గ విస్తరణ ముగిసిన వెంటనే వారికి శాఖలను కేటాయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications