కేశినేని నాని వర్సెస్ సుజనా చౌదరిగా మారిన విజయవాడ పోరు !
ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాక రేపే నియోజకవర్గాల్లో విజయవాడ లోక్ సభ సీటుగా ఒకటిగా కనిపిస్తోంది. గతంలోనూ పలుమార్లు ఇక్కడ హోరాహోరీ ఎన్నికలు జరిగినా.. ఈసారి మారిన పరిస్దితుల్లో ఆ పోరు మరింత రంజుగా మారబోతోంది. దీనికి కారణం వైసీపీలోకి వెళ్లి మరోసారి ఎంపీ టికెట్ తెచ్చుకుని ఎంపీగా బరిలోకి దిగుతున్న కేశినేని నానితో పాటు విజయవాడ పశ్చిమ సీటులో ఎన్డీయే అభ్యర్ధిగా బరిలోకి దిగిన బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరే.
విజయవాడ లోక్ సభ సీటుకు అవకాశం వస్తే పోటీ చేస్తానంటూ ప్రకటించిన సుజనా చౌదరికి ఎన్డీయే పొత్తు లెక్కల్లో ఆ సీటు దక్కలేదు. విజయవాడ లోక్ సభ సీటును వదులుకునేందుకు టీడీపీ ససేమిరా అనడంతో చివరికి అనూహ్యంగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటులో సుజనా బరిలోకి దిగారు. అయితే పేరుకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్ధి అయినా ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటుతో పాటు దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ఆయనదే. దీంతో ఇప్పుడు సుజనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మరోవైపు విజయవాడ ఎంపీ సీటులో తనకు పోటీగా వస్తాడనుకున్న సుజనా చౌదరి కాస్తా ఇప్పుడు విజయవాడ పశ్చిమ సీటుకు వెళ్లడంతో ఒకింత ఊరటగా భావించిన కేశినేని నానికి ప్రస్తుతం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సుజనా చౌదరికి స్ధానికంగా లభిస్తున్న ఆదరణ, కుల సమీకరణాల్లో తన కంటే సుజనాకు ఉన్న పట్టు, టీడీపీ నేతల నుంచి లభిస్తున్న బేషరతు మద్దతు వంటి అంశాలెన్నో ఉన్నాయి. దీంతో సుజనాను టార్గెట్ చేసేందుకు కేశినేని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇలా సుజనా టాలెంట్ తెలిసిన కేశినేని నాని.. ఎంపీగా తన ప్రత్యర్ది అయిన సోదరుడు కేశినేని చిన్ని కంటే ఆయనపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దీనికి కారణం సుజనా ప్రభావం విజయవాడ పశ్చిమ సీటుతో పాటు తన ఎంపీ సీటుపైనా తీవ్రంగా ఉంటుందన్న అంచనాలే. మరోవైపు వీరిద్దరి మధ్య పోరులో కేశినేని చిన్ని నామమాత్రంగా మారిపోతున్నారు. సోదరుడు కేశినేని నానిపై విమర్శలు అయితే చేయగలుగుతున్నారు కానీ పోటాపోటీగా మాత్రం సై అంటే సై అనలేక పోతున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఎన్నికల నాటికి ఈ పోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications