బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి: ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం ఏపీపై పడుతోంది. నైరుతి రుతుపవనాలు నిరాశ పరిచిన ప్రస్తుత పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ద్రోణి కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ ద్రోణికి ఈశాన్య రుతుపవనాలు కూడా తోడవుతున్నాయి.
నేడు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి, ఈశాన్య రుతుపవనాల రాకతో నేటి నుంచి సోమవారం వరకు పలుచోట్ల ఓ మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.

ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, ఉత్తర కోస్తా పరిధిలోని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురస్తాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లా ప్రకాశంతో పాటు రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు.
మిగతా జిల్లాలు.. అన్నమయ్య, మదనపల్లి, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, అనకాపల్లి వంటి చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆయా చోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. ఈదురుగాలులు వీచే సమయంలో హోర్డింగులు, శిథిలభవనాల వద్ద ఉండకూడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
