ఛలో మహాకుంభ్: విజయవాడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు
Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.
45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్. ఆదివారం వరకు 12 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మౌని అమావాస్య రోజున షాహీ స్నాన్ కోసం కోటి మందికి పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తారని అంచనావేస్తోంది.

పవిత్ర స్నానాలను ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ రంగంలోకి దిగింది. దేశం నలుమూలల నుంచీ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచీ ఆయా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటోన్నాయి. 13,000లకు పైగా ప్రత్యేక రైళ్లు ఆయా నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగించనున్నాయి.
తాజాగా- ఏపీఎస్ఆర్టీసీ కూడా రంగంలోకి దిగింది. ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1వ తేదీన తొలి బస్సు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లనుంది. మహా కుంభ మేళా 2025 యాత్ర స్పెషల్ ప్యాకేజీ కింద దీన్ని నడిపించనుంది. ఏడు రోజుల యాత్ర స్పెషల్ బస్ ఇది.
అదే రోజు విజయవాడ నుంచీ ఆర్టీసీ బస్సులు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లనున్నాయి. మొత్తం ఎనిమిది రోజుల మహా కుంభ మేళ యాత్ర స్పెషల్ ఇవి. 1న పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లే బస్సులు మరుసటి రోజు సాయంత్రానికి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటాయి. 3వ తేదీన యాత్రీకులు అక్కడే బస చేస్తారు.
4వ తేదీన ప్రయాగ్‌రాజ్ నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్తాయి. 5వ తేదీన ఉదయం అయోధ్యకు చేరుకుంటాయి. యాత్రీకులు రామ్ లల్లాను సందర్శించుకుంటారు. అదే రోజు రాత్రి వారణాశికి బయలుదేరి వెళ్తాయి బస్సులు. 6వ తేదీన కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవచ్చు. రాత్రి అక్కడే బస ఏర్పాటు చేశారు. 7న ఉదయం వారణాశి నుంచి బయలుదేరి మరుసటి రోజున విజయవాడకు చేరకుంటాయి.
సూపర్ లగ్జరీ- రూ. 8,000, స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్- 11,000, వెన్నెల ఏసీ స్లీపర్- 14,500 రూపాయల ఛార్జీని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వసూలు చేస్తారు. ఇది ఛార్జీ మాత్రమే. భోజనం, వసతి, దర్శనానికి చెల్లించాల్సిన మొత్తాన్ని యాత్రీకులే భరించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications